తెలంగాణ రాష్ట్రం సాంస్కృతిక వైభవానికి, చారిత్రక వారసత్వానికి, వీరత్వానికి ప్రతీక. కాకతీయుల పరిపాలనలో చారిత్రక వైభవంతో విలసిల్లిన వరంగల్ నగరం, నేడు విద్యా, వైద్య, ఆర్థిక రంగాలు మరియు మౌలిక వసతుల కల్పనలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. రాజధాని హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌కు ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకావడం ప్రాంతీయ సమగ్ర అభివృద్ధికి ఎంతో అత్యవసరం.
అయితే ఒక ప్రాంతంలో నిర్మించే విమానాశ్రయానికి పెట్టే పేరు కేవలం ఒక చిరునామా మాత్రమే కాదు అది ఆ నేల యొక్క మూలాలను, సంస్కృతిని, వీరగాథలను ప్రపంచ పటంలో ప్రతిబింబించే గుర్తింపుగా నిలుస్తుంది. ఈ క్రమంలో వరంగల్‌లో నూతనంగా ఏర్పాటు చేసే అంతర్జాతీయ విమానాశ్రయానికి “సమ్మక్క-సారక్క అంతర్జాతీయ విమానాశ్రయం” అని నామకరణం చేయడం అన్ని విధాల మంచిది. ఇది చారిత్రక అవశ్యకత మరియు గిరిజన సంస్కృతికి ప్రపంచ స్థాయిలో లభించే సముచిత గౌరవంగా గుర్తించబడుతుంది.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ – మేడారం జాతర
వరంగల్ లో నిర్మించే విమానాశ్రయానికి ఈ నామకరణ ప్రతిపాదనకు ప్రధాన బలం మేడారం క్షేత్రం మరియు సమ్మక్క-సారక్క జాతర. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క-సారక్క జాతరను “ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ”గా ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తారు. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే ఏకైక ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుక ఇది. దాదాపు కోటిన్నరకు పైగా భక్తులు ఈ జాతరకు తరలివస్తారు. కేవలం తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచే కాక విదేశాల నుంచి కూడా గిరిజన, గిరిజనేతర భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఎలాంటి దేవుళ్ల విగ్రహాలు లేకుండా, ప్రకృతి ఒడిలో చెట్ల నడుమ పసుపు, కుంకుమ, గద్దెలనే దైవంగా భావించి పూజించే అత్యంత విలక్షణమైన, పవిత్రమైన గిరిజన సంప్రదాయం ఇది.
వరంగల్ మీదుగానే మేడారం క్షేత్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. కాబట్టి, ఇక్కడి విమానాశ్రయానికి సమ్మక్క-సారక్కల పేరు పెట్టడం ద్వారా ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ ప్రాముఖ్యతకు మరియు ప్రపంచ పర్యాటక పటంలో ఒక ప్రత్యేకమైన స్థానం కలుగుతుంది.
సమ్మక్క-సారక్కల వీరగాథ – అన్యాయంపై సాగించిన చారిత్రక పోరాటం
సమ్మక్క-సారక్కలు కేవలం పూజలందుకునే దేవతలు మాత్రమే కాదు వారు స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు మరియు ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన మహా వీరనారీమణులు.
12వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో కరువు కాటకాలు ఏర్పడినప్పుడు, ప్రజల వద్ద ఆహార ధాన్యాలు లేక అల్లాడుతున్న సమయంలో గిరిజనులపై పన్నులు (కప్పం) వసూలు చేయడాన్ని సమ్మక్క, ఆమె కుమార్తె సారక్క తీవ్రంగా నిరసించి తమ సైన్యంతో కలిసి పోరాటం చేసారు. గిరిజన ప్రజల సంక్షేమం కోసం, కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి సైన్యంతో సమ్మక్క, సారక్క, నాగులమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ధైర్యంగా పోరాటం చేశారు. సునిశితమైన వ్యూహాలు, గిరిజన విలువిద్య నైపుణ్యంతో శత్రుసైన్యాన్ని గడగడలాడించారు. యుద్ధంలో వీరమరణం పొంది, ప్రాణ త్యాగం చేసారు. వారి త్యాగానికి ప్రతీకగా ఆ నేలపై వెలిసిన కుంకుమ భరిణెలను, గద్దెలను నేటికీ కోట్లాదిమంది ఆరాధిస్తున్నారు.
అణచివేతపై, అన్యాయంపై పోరాడిన ఈ వీరనారీమణుల పేరును అంతర్జాతీయ విమానాశ్రయానికి పెట్టడం ద్వారా వారి అమరత్వానికి, వీరత్వానికి, భారతీయ వీరనారుల చరిత్రకు మనం ఇచ్చే గొప్ప నివాళిగా మారుతుంది.
గిరిజన సమాజానికి తగిన గుర్తింపు మరియు ఆత్మగౌరవం
భారతదేశ సాంస్కృతిక మూలాల్లో గిరిజన వికాసం అత్యంత కీలకమైనది. భారతదేశంలో లక్షలాదిమంది గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క-సారక్కల పేరును ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి నామకరణం చేయడం ద్వారా ఈ దేశ మూలవాసులకు దక్కిన గౌరవంగా భావించబడుతుంది. శతాబ్దాలుగా అడవులను, ప్రకృతిని కాపాడుకుంటూ వస్తున్న గిరిజన సమాజానికి, మూలవాసుల సంస్కృతికి కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది. దేశంలోని ఇతర విమానాశ్రయాలకు రాజకీయ నాయకులు, ప్రముఖ రాజులు లేదా చారిత్రక పురుషుల పేర్లు పెడుతుంటారు. ఆ కోవలో ఒక పోరాట గిరిజన వీరనారీ మణులకు అంతర్జాతీయ స్థాయి పేరు పెట్టడంసామాజిక సమానత్వం, సామాజిక న్యాయానికి మరియు మహిళా సాధికారతకు ఒక దివ్యమైన ఉదాహరణగా నిలుస్తుంది.
అంతర్జాతీయ పర్యాటక ప్రచారం మరియు ఆర్థిక పురోగతి
ఒక విమానాశ్రయానికి ఉన్న పేరు విదేశీ ప్రయాణికులు, పర్యాటకులు మరియు పరిశోధకులలో ఉత్సుకతను రేకెత్తిస్తుంది.విమానాశ్రయానికి “సమ్మక్క-సారక్క” అని పేరు పెట్టడం వల్ల విదేశీ పర్యాటకులు ఆ పేరు వెనుక ఉన్న కథను, మేడారం జాతర విశిష్టతను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఇది తెలంగాణలో ఎకో-టూరిజం, ట్రైబల్ టూరిజం అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. అలాగే ఉత్తర తెలంగాణ ప్రాంతాలైన వరంగల్, ములుగు, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ ప్రాంతాల ప్రజలకు ఈ విమానాశ్రయం ద్వారా అంతర్జాతీయ అనుసంధానం ఏర్పడుతుంది. ఇప్పటికే వరంగల్‌లోని రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా లభించింది. ఇప్పుడు విమానాశ్రయానికి సమ్మక్క-సారక్క పేరు పెట్టడం వల్ల ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు చారిత్రక పర్యాటక రంగం మరింత బలోపేతమవుతుంది.
వరంగల్ నగరంలో నిర్మించే అంతర్జాతీయ విమానాశ్రయానికి “సమ్మక్క-సారక్క అంతర్జాతీయ విమానాశ్రయం” అని పేరు పెట్టడం అనేది ఒక ప్రాంతీయ ప్రతిపాదన మాత్రమే కాదు, అది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగకు, ప్రజా సంక్షేమం కోసం ప్రాణాలర్పించిన గిరిజన వీరనారీమణుల అమరత్వానికి ఇవ్వాల్సిన తగిన గౌరవం.
గిరిజన సంస్కృతి, వీరత్వం, ఆధ్యాత్మికత మరియు ఆధునిక సాంకేతిక ప్రగతిల అద్భుత సమ్మేళనానికి ఈ నామకరణం ఒక చిహ్నంగా నిలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరియు పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ప్రజల మనోభావాలను, చారిత్రక ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకుని వరంగల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి “సమ్మక్క-సారక్క అంతర్జాతీయ విమానాశ్రయం”గా నామకరణం చేయాలని గిరిజన సమాజమంతా మనస్పూర్తిగా ప్రతిపాదిస్తుంది.
వ్యాసకర్త…పరిశోధక విద్యార్థి,వంకా. వరాలబాబు(పిహెచ్.డి)పరిశోధక విద్యార్థి
మద్రాసు యూనివర్సిటీ, చెన్నై.
9948898639.

