

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతి నిధి :
నంబర్ ప్లేట్ లేని టాటా ట్రాలీలో పశువుల తరలింపు – ముగ్గురు నిందితులపై కేసు నమోదు
వివరాలు వెల్లడించిన మరిపెడ ఎస్.ఐ సతీష్
కొబ్బరి బొండాల మాటున పశువులను తరలిస్తూ పోలీసుల కంటపడకుండా అక్రమ రవాణావాహనంలో కాళ్లు, మెడలకు తాళ్లతో కట్టివేసిన 06 ఆవులు, 02 దూడలు (కోడెగిత్తలు) గుర్తింపు. గాయపడిన పశువులకు పశువైద్యులతో చికిత్స అందించి రక్షిత ప్రాంతానికి తరలింపు.
వాహనాన్ని సీజ్ చేసి, ముగ్గురు నిందితులపై కేసు నమోదు.
రాత్రి వేళల్లో మరిపెడ పోలీసులు నిర్వహిస్తున్న పెట్రోలింగ్‌లో పశువుల అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెట్రోలింగ్‌లో ఉన్న మరిపెడ పోలీసు సిబ్బంది పీసీ నరేష్, పీసీ జి. శ్రీను అనుమానాస్పదంగా నంబర్ ప్లేట్ లేకుండా కొబ్బరి బొండాలతో వెళ్తున్న టాటా ట్రాలీ వాహనాన్ని గుర్తించి ఆపి తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో వాహనంలో కొబ్బరి బొండాల మాటున కాళ్లు, మెడలకు తాళ్లతో కట్టివేసి కదలలేని స్థితిలో ఉంచిన 06 ఆవులు, 02 దూడలు (కోడెగిత్తలు) మొత్తం 08 పశువులను గుర్తించారు. పశువులను అమానుషంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లికి చెందిన గొర్ల శివ, యలమచిలీ శివ, బంగారి లచ్చన్న అనే ముగ్గురు నిందితులను గుర్తించారు. నిందితులు అనకాపల్లి ప్రాంతం నుంచి పశువులను సేకరించి, కొబ్బరి బొండాల మాటున హైదరాబాద్‌లోని కబేళాలకు గత కొంతకాలంగా అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
పోలీసులు రక్షించిన పశువులను సురక్షిత ప్రాంతానికి తరలించి, పశువైద్యుల ద్వారా అవసరమైన చికిత్స అందించారు. గాయపడిన పశువులు ప్రస్తుతం కోలుకున్నాయి.
కేసు నమోదు – వాహనం సీజ్
పశువుల అక్రమ రవాణాకు ఉపయోగించిన టాటా ట్రాలీ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. నిందితులపై పశువుల అక్రమ రవాణా, పశువుల పట్ల క్రూరత్వానికి సంబంధించిన చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పశువుల అక్రమ రవాణా, జంతువుల పట్ల క్రూరత్వానికి పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్. ఐ సతీష్ హెచ్చరించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలు ఎక్కడైనా గుర్తించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

