వరదలతో దెబ్బతిన్న ఇళ్లు, పంట పొలాలు, రహదారులు, చెరువుల పరిశీలన

పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ వడితే గణేష్ నవంబర్ 06 2026: అశ్వారావుపేట లో బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం: ఎంపీ, ఎమ్మెల్యే అశ్వారావుపేట, నవంబర్ 6 మురసు తుఫాన్ ప్రభావంతో అశ్వారావుపేట మండలంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామ్ రెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విస్తృతంగా పర్యటించారు. ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబుతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా వరద నీటి ఉధృతికి దెబ్బతిన్న ఇళ్లు, పంట పొలాలు, రహదారులు, చెరువులను పరిశీలించారు. స్థానిక ప్రజలను, నష్టపోయిన రైతులను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రకృతి విపత్తుల సమయంలో ప్రభుత్వం బాధిత ప్రజలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన బాధితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టి రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. చెరువులు, కాలువలు, నీటి ప్రవాహ మార్గాలను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ప్రజలకు తాగునీరు, విద్యుత్, వైద్య సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా పంటలు దెబ్బతిని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ప్రభుత్వ పరంగా తగిన సహాయం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సాధారణ జీవనం పూర్తిస్థాయిలో పునరుద్ధరించే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ పర్యటనలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


