
తాడేపల్లి (పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ – ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి):
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అధికార పార్టీ అరాచకాలకు అద్దం పడుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్.జగన్మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో పలు జిల్లాల నుంచి విచ్చేసిన పార్టీ ముఖ్య నేతలు, శ్రేణులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై ఎన్నికలు జరిగిన తీరు, తదనంతర రాజకీయ పరిణామాలపై క్షుణ్ణంగా చర్చించారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు సర్కార్: వైఎస్ జగన్
ఈ సమావేశంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వ వేధింపులు, అణచివేత ధోరణులను దాటుకుని పార్టీ కేడర్ అంతా కసితో పోరాటం చేసిందని అభినందించారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే వైయస్సార్‌సీపీ ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగిందని స్పష్టం చేశారు.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల దగ్గర నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలోనూ అరాచకాలు, అక్రమాలు సాగినా ప్రజలు వైయస్సార్‌సీపీకే మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, సజావుగా జరిగి ఉంటే వైయస్సార్‌సీపీకి అనుకూలంగా ఇంకా భారీగా ఓటింగ్ నమోదయ్యేదని వెల్లడించారు. ప్రజల్లో తమ పట్ల ఉన్న వ్యతిరేకత బయటకు వస్తే ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందనే భయంతోనే చంద్రబాబు అరాచకాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఎన్నికల అక్రమాల్లో చంద్రబాబు సరికొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చారని, వైయస్సార్‌సీపీ విజయం సాధించిన చోట్ల కూడా కరెంట్ నిలిపివేసి, కౌంటింగ్ లెక్కలు తారుమారు చేశారని ధ్వజమెత్తారు. వైయస్సార్‌సీపీ హయాంలో అక్రమాలు జరిగాయని లేని అబద్ధాలు ప్రచారం చేస్తూ, ఇప్పుడు తమ దుశ్చర్యలను సమర్థించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
బౌన్సర్లు, బెదిరింపులతో ఎన్నికల ప్రహసనం: వైయస్సార్‌సీపీ నాయకులు
సమావేశంలో పాల్గొన్న పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ… తమ రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికల అక్రమాలను ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా నిర్వీర్యమైందని ఆరోపించారు. లెక్కింపు కేంద్రాల్లో ఏజెంట్లకు బదులుగా బౌన్సర్లను పెట్టి నడిపించారని, అభ్యర్థుల బంధువులను కిడ్నాప్ చేసి బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేశారని తెలిపారు.
చెల్లని ఓట్ల పేరుతో వైయస్సార్‌సీపీ ఓట్లను రద్దు చేయడం, ఫలితాలు తారుమారు చేయడం, వైయస్సార్‌సీపీ డిమాండ్ చేసిన చోట రీకౌంటింగ్ చేయకపోవడం వంటి అక్రమాలకు పాల్పడ్డారని ఎండగట్టారు. అధికార పార్టీకి అదనపు బ్యాలెట్ పేపర్లు అందించి గెలిపించుకున్నారని, ఈ దాడులు, అరాచకాల వల్ల రాష్ట్రంలో గ్రామా గ్రామాన చంద్రబాబు బాధితులు తయారయ్యారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలోనే కూటమి ప్రభుత్వ అరాచకాలపై సమరశంఖం పూరిస్తామని వైయస్సార్‌సీపీ శ్రేణులు స్పష్టం చేశాయి.

