“తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తగులుతుంది” – తాటి వెంకటేశ్వర్లు
పొలిటికల్ పవర్, అశ్వారావుపేట, ఆగస్టు 17:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ఆడబిడ్డలు ఆనందంగా జీవించాలని కలలు కని, ప్రాణాలకు తెగించి ఉద్యమించి కేసీఆర్ తెలంగాణ సాధించారని అశ్వారావుపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఉద్యమాలు చేయాల్సి వచ్చినా వెనుకడుగు వేయకుండా, ఎందరో అమరుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో నేడు ప్రజావ్యతిరేక పాలన కొనసాగుతోందని తాటి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం కోసం సాధించుకున్న తెలంగాణలో పేద కుటుంబాలపై భారం పెంచడం, ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలిచే పథకాలకు ఆటంకాలు కల్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఆడపిల్ల అంటే ఇంటికి భారం కాదని, ఆడబిడ్డ ఇంటికి మహాలక్ష్మి అని భావించిన నాయకుడు కేసీఆర్ అని తాటి పేర్కొన్నారు. ఆడబిడ్డను కన్న తల్లిదండ్రులు ఆమె వివాహ సమయంలో ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే గొప్ప ఉద్దేశంతో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ పథకాల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు కేసీఆర్ ప్రభుత్వం ఎంతో అండగా నిలిచిందన్నారు. అటువంటి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేయడం దుర్మార్గమని తాటి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ఆడబిడ్డల పెళ్లిళ్లకు అందాల్సిన ఆర్థిక చేయూతను నిలిపివేయడం సిగ్గుచేటని విమర్శించారు.కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై ఆధారపడిన అనేక పేద కుటుంబాలు నేడు ఆందోళనకు గురవుతున్నాయని, కూతుళ్ల పెళ్లిళ్ల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేద తల్లిదండ్రుల కష్టాలను అర్థం చేసుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.“కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.. కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పింది” అని తాటి వెంకటేశ్వర్లు అన్నారు. తెలంగాణ ఆడబిడ్డల కన్నీళ్లకు కారణం కావద్దని, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తి స్థాయిలో కొనసాగించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుని, అర్హులైన ప్రతి కుటుంబానికి సకాలంలో ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరారు. లేకపోతే ఆడబిడ్డల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని తాటి వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
