త్వరలో ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు: మంత్రి పొన్నం ప్రభాకర్

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఎడిటర్ బి చంద్రశేఖర్ హైదరాబాద్, ఆగస్టు 17 2026: ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మినిస్టర్ క్వార్టర్స్‌లో తెలంగాణ కేకేసీ యూనియన్ ప్రతినిధులు మంత్రిని కలిసి ఆటో కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఆటో కార్మికుల సమస్యలపై ఇప్పటికే కేబినెట్‌లో చర్చించామని, త్వరలో రవాణా శాఖ తరఫున కార్మిక శాఖతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వీలైనంత త్వరగా ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
ఆటో ఛార్జీల పెంపుపై పరిశీలన
ఆటో ఛార్జీలను పెంచాలని కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయని మంత్రి తెలిపారు. 2012లో చివరిసారిగా ఛార్జీలు పెంచారని, అప్పటి నుంచి దాదాపు 14 సంవత్సరాలుగా పెంపు జరగలేదన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు, వాహనాల ధరలు, నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఆటో కార్మికుల ఇబ్బందులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు. అయితే ప్రయాణికులపై అదనపు భారం పడకుండా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలపై ప్రచారం అవాస్తవం
ఆర్టీసీ తరఫున ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసి ఆర్టీసీనే వాటిని నడుపుతుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆటో కార్మికుల ఉపాధిని దెబ్బతీసేలా ఆర్టీసీకి ఎలాంటి ఆలోచన లేదని తెలిపారు. ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేయదని స్పష్టంగా పేర్కొన్నారు.
లాస్ట్ మైల్ కనెక్టివిటీకి ప్రాధాన్యం
ఆర్టీసీ, రైల్వే, మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థలను పరస్పరం అనుసంధానం చేసి లాస్ట్ మైల్ కనెక్టివిటీని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ప్రయాణికులు ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి తిరిగి ఇంటికి చేరే వరకు సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థను రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
ఎలక్ట్రిక్‌గా మార్చేందుకు రూ.1.50 లక్షల వరకు సాయం
ప్రస్తుతం వినియోగంలో ఉన్న పెట్రోల్, డీజిల్ ఆటోలను రెట్రోఫిట్మెంట్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ఒక్కో ఆటోకు రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ఆటో కార్మికులకు మరింత మేలు చేసేలా త్వరలోనే శుభవార్త చెబుతామని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఆటో కార్మికుల ఉపాధికి పూర్తి రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.


