పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లాప్రతినిధి ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం , జూన్ 4 (గుబ్బగుర్తి ):
అక్రమంగా అటవీ భూమిని ఆక్రమించడమే కాకుండా, అందులోని చెట్లను నరికివేసిన ఒక వ్యక్తికి ఖమ్మం జిల్లా కోర్టు మూడు నెలల జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ వివరాలను ఖమ్మం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ స్. బాలరాజు, గుబ్బగుర్తి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గుగులోత్ ఉపేంద్రయ్య గురువారం నాడు మీడియాకు వెల్లడించారు.
ఫారెస్ట్ అధికారుల కథనం ప్రకారం… రఘునాథపాలెం మండలం, ఎన్ వి బంజర (గుబ్బగుర్తి ఆర్ఎస్) ప్రాంతానికి చెందిన జర్పల చిన్న (తండ్రి: కృష్ణ) అనే వ్యక్తి 2020 సంవత్సరంలో గుబ్బగుర్తి సెక్షన్ పరిధిలోని ప్రభుత్వ అటవీ భూమిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో అక్కడి విలువైన చెట్లను అక్రమంగా నరికివేశాడు. దీనిపై అప్పట్లోనే అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ముద్దాయిపై చార్జ్‌షీట్ దాఖలు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. గత కొన్నాళ్లుగా ఖమ్మం జిల్లా కోర్టులో జరుగుతున్న ఈ కేసు విచారణ ముగిసింది. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ముద్దాయి జర్పల చిన్నకు 3 నెలల జైలు శిక్ష మరియు ₹2,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని యెడల అదనపు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉప్పలయ్య మాట్లాడుతూ… ప్రభుత్వ అటవీ భూములను ఆక్రమించినా, చెట్లను నరికి పర్యావరణానికి హాని కలిగించినా చట్టపరంగా ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. అటవీ సంపదను కాపాడటం అందరి బాధ్యతని, నిబంధనలు అతిక్రమిస్తే ఇలాంటి కఠినమైన శిక్షలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
