
పొలిటికల్ పవర్,అశ్వారావుపేట, అక్టోబర్ 29: అశ్వారావుపేట ఆయిల్‌పామ్ నర్సరీ నుంచి నెల రోజుల్లోనే రికార్డు స్థాయిలో 3,76,096 ఆయిల్‌పామ్ మొక్కలను రైతులకు పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు పారదర్శకంగా మొక్కలను సరఫరా చేశారు.
వీటిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 1,84,280, ఖమ్మం జిల్లాకు 1,21,976 మొక్కలను అందించారు. మొత్తం 6,598 ఎకరాల్లో సాగుకు సరిపడా మొక్కలను పంపిణీ చేసినట్లు ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు.
జనవరిలో రెండో విడత పంపిణీ కోసం మరో 2.50 లక్షల మొక్కలు అందుబాటులోకి రానున్నాయి. రానున్న రోజుల్లో వివిధ జిల్లాలకు అదనంగా 5,74,389 మొక్కలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులు తమ పొలాల్లో డ్రిప్ సేద్య పరికరాలను ఏర్పాటు చేసుకుని, సంబంధిత ఫీల్డ్ ఆఫీసర్ల వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఆయిల్‌పామ్ మొక్కల సంరక్షణపై సూచనలు
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నాటిన లేత మొక్కలకు తగినంత నీరు అందించాలని, నీటి నిర్వహణలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఆకులు, కొమ్మలను ఆశించే పురుగుల నివారణకు సిఫార్సు చేసిన మందులను నిర్ణీత వ్యవధిలో పిచికారీ చేయాలని, ప్రతి మూడు నెలలకు ఒకసారి సూచించిన మోతాదులోనే ఎరువులు వేయాలని తెలిపారు. అంతర పంటలు సాగు చేయని రైతులు మొక్కల చుట్టూ జనుము లేదా జిలుగు విత్తనాలు నాటడం ద్వారా వేడి నుంచి రక్షణ పొందడంతో పాటు పచ్చిరొట్ట ఎరువును అందించవచ్చని పేర్కొన్నారు.

