అవగాహన లేకుండా పనిచేసే అధికారులకు నోటీసులు జారీ చేయండి
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ప్రతి అధికారి బాధ్యత -ఎమ్మెల్యే
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 03 2026: ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం ఏమాత్రం సహించబోమని, విధుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం పెబ్బేరు మండల కేంద్రంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని శాఖల వారీగా సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్, విద్యుత్, అంగన్వాడి శాఖల పనితీరుపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై అవగాహన లేకుండా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారులను గుర్తించి వెంటనే నోటీసులు జారీ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రతి అధికారికి విధి అని, అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం ప్రతి అధికారి బాధ్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలు, మౌలిక సదుపాయాలు, ప్రజా ఆస్తులను నిర్లక్ష్యం చేయకుండా సంరక్షించాలని సూచించారు. వ్యవసాయ శాఖపై కీలక ఆదేశాలు వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఆన్‌లైన్ నమోదు, సాగు విస్తీర్ణం, పంటల వివరాలపై పూర్తి అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులు, విత్తనాల నిల్వలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులను ఇబ్బందులకు గురిచేసే ఎరువుల డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థపై ప్రత్యేక సమీక్షవిద్యా రంగంపై ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అమలు చేస్తున్న కార్యక్రమాలను అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని, పాఠశాలల్లో మౌలిక వసతులు, హాజరు, బోధన ప్రమాణాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. అంగన్వాడి కేంద్రాల్లో పౌష్టికాహారం పక్కదారిపట్టొద్దు అంగన్వాడి కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం పిల్లలకు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఎమ్మెల్యే అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి పౌష్టికాహారం పంపిణీలో లోపాలు జరిగితే సంబంధిత అధికారులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని ఎంపీడీవోకు సూచించారు. వైద్య సేవల బలోపేతానికి చర్యలు పెబ్బేరు పట్టణంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం జరుగుతోందని, అది పూర్తయిన తర్వాత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని వైద్యశాఖ అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్లపై స్పష్టమైన హామీ రాష్ట్ర ప్రభుత్వం గుడిసెలు లేని వనపర్తి జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిజమైన అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులను గుర్తించడంలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. పశుసంవర్థక శాఖ అధికారులు రైతులకు గడ్డి విత్తనాలను అందుబాటులో ఉంచి పశుసంపద అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. భూగర్భ జలాల పరిరక్షణకు ఇంకుడు గుంతల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టాలని, ప్రతి రైతు పొలంలో నీటి సంరక్షణ చర్యలు అమలు చేసేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షుడు విజయవర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, సింగిల్ విండో అధ్యక్షుడు కోదండరామిరెడ్డి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి యాదయ్య, ఎమ్మార్వో, ఎంపీడీవో, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

