పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఆర్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో: బాజా శేఖర్ హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో దళిత ఎమ్మెల్యేలు వివక్షకు, అణిచివేతకు గురవుతున్నారని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క మందుల సామేల్‌కే కాకుండా కాంగ్రెస్‌కు చెందిన దళిత ఎమ్మెల్యేలందరికీ ఇదే పరిస్థితి ఎదురవుతోందని ఆయన పేర్కొన్నారు. దళిత ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఈ పరిస్థితిని సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ అంశాలన్నింటినీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లామని, సమస్యలను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. ఎస్సీ ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని, అభివృద్ధి బిల్లుల మంజూరులో ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. అదేవిధంగా, తమ నియోజకవర్గాలకు అదనంగా వెయ్యి ఇళ్లను మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్‌లో దళిత ప్రజాప్రతినిధుల పట్ల వ్యవహార శైలిపై ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
