సుజాతనగర్లో 667 ఎకరాల్లో ఏర్పాటు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో ముందడుగు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ నవంబర్ 15 2026: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. జిల్లాలో ఆరు ప్రాంతాల్లో సర్వే నిర్వహించిన విమానాశ్రయ ప్రాధికార సంస్థ అధికారులు సుజాతనగర్ను అనువైన ప్రాంతంగా ఎంపిక చేశారు. ఇక్కడ సుమారు 667 ఎకరాల్లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో కేంద్రం సాంకేతిక నిపుణుల బృందాన్ని పంపించి క్షేత్రస్థాయి సర్వే నిర్వహించింది. సర్వే నివేదిక ఆధారంగా సుజాతనగర్ను ఎంపిక చేసినట్లు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. తదుపరి భూసేకరణ, ఇతర అనుమతులు, నిర్మాణానికి సంబంధించిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉంది. విమానాశ్రయం ఏర్పాటు పూర్తయితే జిల్లాలో రవాణా సౌకర్యాలు, పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటక రంగానికి ఊతం లభించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రయత్నాలపై స్థానికంగా చర్చ జరుగుతోంది.


