ePaper
Friday, August 14, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిగణప సముద్రం భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా కృషి

గణప సముద్రం భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా కృషి

📰 Generate e-Paper Clip

రైతుల ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రయోజనాలు రెండూ కాపాడేలా చర్యలు భూములు కోల్పోతున్న రైతులకు మెరుగైన పరిహారం కోసం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవ

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 13 2026: గణప సముద్రం రిజర్వాయర్ నిర్మాణంతో ఎంతో మంది రైతులకు సాగునీటి ప్రయోజనం కలగనున్న నేపథ్యంలో, రిజర్వాయర్ కోసం భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా న్యాయం జరిగేలా బాధ్యత తీసుకుంటానని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ కిల్లు శివకుమార్ నాయుడు, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి బుద్ధారం, ఘనపూర్, గణపసముద్రం భూ నిర్వాసిత రైతులతో ఎమ్మెల్యే ముఖాముఖి చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ… గణప సముద్రం రిజర్వాయర్ నీటితో వేలాది ఎకరాలకు సాగునీరు అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని, అదే సమయంలో ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులకు అన్యాయం జరగకుండా చూడటం కూడా ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. రిజర్వాయర్‌లో నిర్ణీత నీటి నిల్వ సామర్థ్యం తగ్గకుండా బండ్ ఎత్తు పెంచే అవకాశం ఉందా అనే అంశంపై సమగ్రంగా సర్వే చేసి నివేదిక అందించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. దీనివల్ల రైతుల నుంచి సేకరించాల్సిన భూమి విస్తీర్ణం తగ్గడంతో పాటు రైతులకు, ప్రభుత్వానికి రెండింటికీ ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఎకరాకు రూ.11.25 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉన్నప్పటికీ, సన్న, చిన్నకారు రైతులు భూములు కోల్పోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నందున వారికి మరింత మెరుగైన పరిహారం అందించాలని ఎమ్మెల్యే కలెక్టర్‌ను కోరారు. భూ నిర్వాసిత రైతులు ఎకరాకు రూ.15 లక్షల పరిహారం కోరగా, రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎకరాకు రూ.14 లక్షలు లేదా అంతకంటే మెరుగైన పరిహారం అందించేలా చూడాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సూచించారు. దీనిపై రైతులు కూడా సానుకూలంగా స్పందిస్తూ, రూ.14 లక్షలకు మించి సాధ్యమైనంత మెరుగైన పరిహారం అందించాలని కోరారు. అదేవిధంగా ఇల్లు లేని పేద భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించే బాధ్యతను తాను తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రిజర్వాయర్ నిర్మాణం ద్వారా భవిష్యత్ తరాలకు ప్రయోజనం చేకూరనున్నందున రైతులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. భూసేకరణ అంశంపై రైతులతో చర్చలు సానుకూలంగా సాగి పరిష్కారం దిశగా ముందుకు సాగడంపై ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడుతూ గణప సముద్రం రిజర్వాయర్‌ను పూర్తి చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ… నిబంధనల ప్రకారం పి.ఎన్. చేసిన నాటికి ఉన్న ప్రభుత్వ భూమి విలువ ఆధారంగా మూడు రెట్లు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే రైతులు, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి విజ్ఞప్తి మేరకు చర్చలు జరిపి ఒక అంగీకారానికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ కిల్లు శివకుమార్ నాయుడు మాట్లాడుతూ… భూములు కోల్పోతున్న రైతులకు నష్టం కలగడం సహజమే అయినప్పటికీ, గణప సముద్రం రిజర్వాయర్ వల్ల అనేక మంది రైతులకు ప్రయోజనం కలగడంతో పాటు మిగిలిన భూములకు కూడా భవిష్యత్‌లో డిమాండ్ పెరుగుతుందని తెలిపారు. జనరల్ అవార్డుకు వెళితే రైతులకే నష్టం జరిగే అవకాశం ఉన్నందున చర్చల ద్వారా పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు. బండ్రాయిపాకుల నిర్వాసితులకు పునరావాస కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, ఇరిగేషన్ ఎస్‌ఈ చంద్రశేఖర్, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ తిరుపతయ్య, ఏ.డీ. సర్వే శ్రీనివాసులు, తహసీల్దార్లు, పెద్దమందడి, ఘనపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు నవనీత, అచ్యుతరావు, భూ నిర్వాసిత రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!