దళితులు నడిచిన నేలను శుద్ధి చేయడం అవమానకరం
బిఆర్‌ఎస్‌లో ఉన్న దళితులు వెంటనే రాజీనామా చేయాలి
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 10 2026: పెద్దమందడి దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే వారి పట్ల అవమానకరంగా వ్యవహరించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని పామిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… దళిత సంఘాల నేతలు ఒక రాజకీయ నాయకుడి నివాసం వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన సమయంలో, దళితులు నడిచిన నేలను పసుపు నీళ్లు, పాలతో శుద్ధి చేయడం దళిత సమాజాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను సైతం కించపరిచేలా మాట్లాడటం బాధాకరమన్నారు. అధికారంలో ఉన్న సమయంలో దళితులకు మూడు ఎకరాల భూమి, దళిత బంధు, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని హామీలు ఇచ్చి, ఆ హామీలను అమలు చేయకుండా దళితులను మోసం చేశారని కేసీఆర్‌పై ఆమె విమర్శలు చేశారు. దళితులు వ్యవసాయం చేస్తూ దేశానికి అన్నం పెడుతున్నారని, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నారని పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ దళితుల గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలకు జరిగిన అవమానంపై కేసీఆర్, కేటీఆర్ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. దళితుల పట్ల అవమానకర వైఖరిని విడనాడి, ఇకనైనా బాధ్యతగా వ్యవహరించాలని ఆమె హెచ్చరించారు. దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న దళిత నాయకులు, కార్యకర్తలు ఈ ఘటనపై స్పందించి వెంటనే పార్టీకి రాజీనామా చేయాలని మధిర మంజుల శ్రీశైలం పిలుపునిచ్చారు.

