ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పంచమి వేళ భూగర్భ వారాహి మాత ఆలయంలో భక్తుల రద్దీ

పంచమి వేళ భూగర్భ వారాహి మాత ఆలయంలో భక్తుల రద్దీ

📰 Generate e-Paper Clip

 

విశేష పూజలు.. సామూహిక కుంకుమార్చనలు.. అమ్మవారి ఆశీస్సుల కోసం తరలివచ్చిన భక్తులు

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే21:

తూర్పుగోదావరిజిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో వెలసిన ప్రసిద్ధ భూగర్భ వారాహి మాత ఆలయంలో పంచమి సందర్భంగా గురువారం విశేష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, కుంకుమలతో ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక హారతులు సమర్పించారు. అనంతరం మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆలయంలో మారుమోగిన మంత్రోచ్ఛారణలు, అమ్మవారి నామస్మరణలతో భక్తులు భక్తి పరవశంలో మునిగిపోయారు. భూగర్భంలో వెలసిన వారాహి మాతను దర్శించుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని, అమ్మవారికి మొక్కులు చెల్లిస్తే కోరికలు నెరవేరుతున్నాయని భక్తులు విశ్వాసంతో చెబుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ ఆలయానికి తరలివస్తుండడం విశేషం. అతి తక్కువ కాలంలోనే భూగర్భ వారాహి మాత ఆలయం విశేష ఖ్యాతిని సంపాదించుకుని భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. ముఖ్యంగా ఐదు వరుస శుక్రవారాలు అమ్మవారిని దర్శించుకుని కంద దీపం సమర్పిస్తే కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వివాహ ఆటంకాలు తొలగి అమ్మవారి కరుణ కటాక్షాలు లభిస్తాయని భక్తులలో బలమైన నమ్మకం నెలకొంది.
దీంతో ప్రతి శుక్రవారం ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!