పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ ప్రతినిధి జూన్ 08 2026: హైదరాబాద్‌లో తెలంగాణ హౌసింగ్ బోర్డు భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రాము నాయక్ గతంలో తెలంగాణ హౌసింగ్ బోర్డులో ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్‌గా పనిచేసిన సమయంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో ఆయనను వెంటనే సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూముల గుర్తింపు కార్యక్రమంలో భాగంగా హౌసింగ్ బోర్డు భూములను పరిశీలిస్తున్న సమయంలో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. హైకోర్టు సమీపంలోని విలువైన హౌసింగ్ బోర్డు స్థలాన్ని 2018లో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూమిని మాజీ హౌసింగ్ బోర్డు ఉద్యోగి ఇఫ్తాకర్ అహ్మద్ భార్య పేరిట నమోదు చేసినట్లు విచారణలో తేలింది. అదేవిధంగా విజయనగర్ కాలనీ, తుల్జాగూడ, లక్ష్మిగూడ, మహబూబ్‌గంజ్ ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను కూడా పలు వ్యక్తుల పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాలపై లోతైన విచారణ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. రాము నాయక్‌కు సహకరించిన హౌసింగ్ బోర్డు సూపరింటెండెంట్ వివేకానంద్‌ను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించగా, మరో సూపరింటెండెంట్ బోనా నాయక్‌ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. సంబంధిత సబ్-రిజిస్ట్రార్ల పాత్రపై కూడా విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే వాటిని దోచుకునేందుకు ప్రయత్నించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మంత్రి మండిపడ్డారు. ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు, నకిలీ పత్రాలు సృష్టించేందుకు లేదా అధికార దుర్వినియోగానికి పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలు కూడా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. “ప్రభుత్వ భూములను కొల్లగొట్టే అధికారులకు ప్రభుత్వ సేవలో కొనసాగే అర్హత లేదు. ప్రజల ఆస్తులను దోచుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదు” అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, భూ కబ్జాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, అధికార దుర్వినియోగంపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని మంత్రి హెచ్చరించారు.
