
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*
ఆర్టీసీ బస్సుల్లో చిల్లర కోసం జరిగే గొడవలు కొత్తేమీ కాదు. నిత్యం ఏదో ఒకచోట కండక్టర్లకు, ప్రయాణికులకు మధ్య చిల్లర విషయంలో వాగ్వాదాలు జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు అవి తీవ్ర ఘర్షణలకు దారితీస్తుంటాయి. కానీ, ఈసారి ఆ చిల్లర గొడవ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఎంతటి విషాదం! ఎంతటి దురదృష్టం!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపోకు చెందిన తెలంగాణ ఆర్టీసీ మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక (24) విధి నిర్వహణలో ఎదురైన ఓ దురదృష్టకర ఘటనకు చివరకు బలైపోయారు. బస్సులో ప్రయాణికురాలితో వంద రూపాయల చిల్లర విషయంలో మొదలైన వివాదం క్రమంగా ముదిరి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ప్రయాణికురాలు తోసివేయడంతో ప్రవళిక కదులుతున్న బస్సు చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో పది రోజుల పాటు మృత్యువుతో పోరాడి, చివరకు నవంబర్ 4వ తేదీ బుధవారం ఉదయం కన్నుమూశారు.
ఏమని చెప్పాలి ఈ ఘటనను? ఎవరిని నిందించాలి? ఎవరిని తప్పుపట్టాలి? ఒక చిన్న వివాదం ఇంతటి విషాదానికి దారితీయడం ఎంత బాధాకరం!
ఈ ఘటనలో ప్రయాణికురాలు బానోతు మౌనికపై కేసు నమోదైనట్లు సమాచారం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పు చేసినట్లు తేలితే శిక్ష కూడా తప్పదు. కానీ, ఈ ఘటనలో ఇప్పటికే రెండు కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. ఒక కుటుంబం కన్నబిడ్డను కోల్పోతే, మరో కుటుంబం తమవారి భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళనలో పడింది.
ప్రవళిక కుటుంబ నేపథ్యం మరింత హృదయవిదారకం. ఆమె తండ్రి నాగరాజు ఆర్టీసీలో మెకానిక్‌గా పనిచేస్తూ మరణించారు. తండ్రి మరణానంతరం కారుణ్య నియామకం కింద ప్రవళికకు కండక్టర్ ఉద్యోగం లభించింది. ఆ ఉద్యోగంతో కుటుంబానికి కొంత ఆర్థిక భరోసా ఏర్పడింది. కుటుంబం క్రమంగా కష్టాల నుంచి కోలుకుంటున్న సమయంలో ప్రవళికకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. ఇంతలోనే ఈ ఘోరం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దుఃఖంలోకి నెట్టింది.
కన్నబిడ్డను కోల్పోయిన ఆ తల్లి బాధను, కుటుంబ సభ్యుల ఆవేదనను మాటల్లో వర్ణించగలమా? కుటుంబానికి అండగా నిలుస్తుందనుకున్న బిడ్డే ఇలా అర్ధంతరంగా తనువు చాలిస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి? వారి భవిష్యత్తు ఏమవుతుంది?
మరోవైపు, క్షణికావేశంలో జరిగిన ఈ ఘటనలో నిందితురాలిగా ఉన్న ప్రయాణికురాలి కుటుంబం కూడా ఇప్పుడు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒక వంద రూపాయల చిల్లర కోసం మొదలైన వివాదం.. ఒకరిని శాశ్వతంగా దూరం చేసింది. మరొకరిని చట్టపరమైన చిక్కుల్లోకి నెట్టింది. చివరకు రెండు కుటుంబాల జీవితాల్లోనూ చీకటిని నింపింది.
క్షణికావేశాలు మనిషిని మాయం చేస్తున్నాయి!
మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు – మహాకవి అందెశ్రీ మాటలు.. ప్రతిసారి పదే పదే గుర్తొస్తాయి.
ఇక్కడ ఆడ, మగ అనే లింగభేదం లేదు. ఎవరు తప్పు చేసినా తప్పే. చిన్న చిన్న విషయాలకే సహనం కోల్పోయి, ఆవేశానికి లోనై ఎదుటివారిపై దాడులకు దిగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. మాటలతో పరిష్కరించుకోగలిగే సమస్యలను చేతలతో తీవ్ర పరిణామాలకు తీసుకెళ్తున్నాం. ఆ క్షణంలో కోపం ముందు విచక్షణ కోల్పోతున్నాం. కానీ ఆ క్షణం దాటిన తర్వాత మిగిలేది జీవితాంతం వెంటాడే పశ్చాత్తాపం, కన్నీళ్లు మాత్రమే.
ఇలాంటి ఘటనలకు ఎక్కడో ఒకచోట ఫుల్స్టాప్ పడాలి. అందుకు ఎవరో వచ్చి మనల్ని మార్చాల్సిన అవసరం లేదు. మార్పు మనలోనే మొదలవ్వాలి. ఎదుటివారి పట్ల గౌరవం, మాటల్లో సంయమనం, ప్రవర్తనలో సహనం ఉండాలి. ఎంతటి వివాదమైనా ప్రాణాల కంటే విలువైనది కాదు. ఒక క్షణం ఆగి ఆలోచిస్తే ఎన్నో అనర్థాలను నివారించవచ్చు.
కోపం తెచ్చుకోను అంటే ఒక చిన్నమాట:
ఏళ్ల తరబడి ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్య కొనసాగుతూనే ఉంది. చిల్లర లేదని ప్రయాణికులు ఇబ్బంది పడటం, సరిపడా చిల్లర ఇవ్వలేదని కండక్టర్లు ఇబ్బంది పడటం నిత్యకృత్యంగా మారింది. కండక్టర్లకు, ప్రయాణికులకు మధ్య ఈ విషయంలో తరచూ వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అన్న చందంగా పరిస్థితి తయారైంది.
బస్సుల్లో ‘టికెట్‌కు సరిపడా చిల్లర ఇచ్చి సహకరించండి’ అంటూ సూచనలు రాసి చేతులు దులుపుకోవడం కాకుండా, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఆర్టీసీపై ఉంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వారా చిల్లర నాణేల పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు, బ్యాంకుల ద్వారా నాణేల లభ్యత వంటి అవకాశాలను ప్రభుత్వ రంగ సంస్థగా ఆర్టీసీ సమర్థంగా వినియోగించుకోవాలి. ప్రయాణికులకు, కండక్టర్లకు చిల్లర సమస్య లేకుండా డిజిటల్ చెల్లింపులను మరింత విస్తృతం చేయాలి. అవసరమైన చోట డిపోలు, బస్సుల్లో చిల్లర అందుబాటును మెరుగుపరచాలి. ఇవన్నీ పరిశీలించి ఆచరణ సాధ్యమైన పరిష్కారాలను అమలు చేయాలి.
ఎందుకంటే ఇది కేవలం చిల్లర సమస్య కాదు. ప్రయాణికులకూ, సిబ్బందికీ మధ్య అనవసర ఘర్షణలకు దారితీస్తున్న సమస్య. ఒక చిన్న మొత్తానికి సంబంధించిన వివాదం చివరకు ఒక యువతి ప్రాణాలను బలితీసుకున్న దుర్ఘటనగా మిగిలిపోయిందిప్రవళిక మరణం మరో కుటుంబానికి తీరని శోకం. ఈ ఘటన నుంచి సమాజం ఒక గుణపాఠం నేర్చుకోవాలి. క్షణికావేశానికి కళ్లెం వేయాలి. ఆర్టీసీ చిల్లర సమస్యకు శాశ్వత పరిష్కారం చూపక వంద రూపాయల చిల్లర కోసం మొదలైన గొడవ.. ఒక కుటుంబానికి జీవితాంతం తీరని లోటును మిగిల్చింది. ఇకనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ప్రవళిక మరణం వృథా కాకూడదు. ఆమె కుటుంబానికి న్యాయం జరగడంతో పాటు, మరో ప్రవళిక ఇలాంటి దుర్ఘటనకు బలికాకుండా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి.అని పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక యాజమాన్యం పేద ప్రజల తరుపున కోరుకుంటుంది

