సాంకేతిక కారణాలతో ఇన్నాళ్లు జాప్యం
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం సహించం…
మహిళా సంఘాల రుణాల మంజూరులో నిర్లక్ష్యంపై ఏపీఎంపై ఎమ్మెల్యే ఆగ్రహం
కేవలం 30 నెలల్లో విద్యుత్ శాఖ ద్వారా రూ.140 కోట్ల అభివృద్ధి పనులు… మరో రూ.40 కోట్ల పనులకు శ్రీకారం
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 31 2026: ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ప్రభుత్వం ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోంది… అధికారులు కూడా అదే నిబద్ధతతో పనిచేయాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థాయిలో ప్రజలకు సకాలంలో అందించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులను ఉపేక్షించబోమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హెచ్చరించారు. ప్రతి శాఖ ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేయాలని, ప్రభుత్వ పథకాల అమలులో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. శుక్రవారం పెద్దమందడి మండల రైతువేదికలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శాఖల వారీగా సమీక్ష నిర్వహించి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
రూ.40 కోట్ల పెద్దమందడి–వనపర్తి రహదారి పనులు వారం రోజుల్లో ప్రారంభం
పెద్దమందడి–వనపర్తి ప్రధాన రహదారి నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరైనప్పటికీ పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖల మధ్య నెలకొన్న సాంకేతిక కారణాల వల్ల పనుల్లో జాప్యం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసి సమస్యలను పరిష్కరించినట్లు వెల్లడించిన ఆయన, మరో వారం రోజుల్లో రహదారి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. వ్యవసాయ శాఖ రైతులకు మరింత చేరువ కావాలి వ్యవసాయ శాఖ సమీక్షలో రైతులు యూరియా బుకింగ్ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సభ్యులు ప్రస్తావించారు. యాప్‌లో బుక్ చేయగానే కొన్ని సెకన్లలోనే “నో స్టాక్” అని చూపించడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన ఎరువులు, సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని వేగవంతం చేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. లబ్ధిదారులకు మట్టి, ఇసుక సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల రుణాల మంజూరులో జాప్యం జరగడంపై ఏపీఎంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు. నియోజకవర్గంలో గత 30 నెలల్లో విద్యుత్ శాఖ ద్వారా రూ.140 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం మరో రూ.40 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే విద్యుత్ రంగంలో వనపర్తి మూడో స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అధికారులు పనిచేయాలని, లైన్‌మెన్‌లు ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఆదేశించారు. గ్రామాల్లో నిరంతరాయంగా వీధిలైట్లు వెలుగు తున్నాయనీ వాటి పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పనిచేయని వీధిలైట్లను వెంటనే మరమ్మతు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తున్న గ్రామపంచాయతీలను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే సంబంధిత గ్రామపంచాయతీల బిల్లులను నిలిపివేసే చర్యలు కూడా తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇంకుడు గుంతలు ఫామ్ పాండ్ల నిర్మాణాలను చేసిన వేగవంతం చేయాలన్నారు. నీటి సంరక్షణకు ఉపయోగపడే ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. భూగర్భ జలాల పెంపు, వ్యవసాయానికి మేలు చేసే ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన చేయాలని సూచించారు. విద్యా రంగంలో సమూల మార్పులు జరుగుతున్నాయని, తెలంగాణలో విద్యా రంగంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారనీఎమ్మెల్యే పేర్కొన్నారు. రాబోయే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను పూర్తిస్థాయిలో ఆధునికీకరించి, విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటిని మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా ఆసుపత్రిలో మూడు నెలలకు సరిపడా మందులను ముందుగానే, అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి లోటు ఉండకూడదన్నారు. భూభారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అవుతుంది. ధరణి పోర్టల్ కారణంగా ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి ద్వారా ఆ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు పారదర్శకమైన భూ సేవలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ
అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. వారం రోజుల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అలాగే ప్రతి కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, అదే నిబద్ధతతో అధికారులు కూడా పనిచేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్పష్టం చేశారు. మీకే ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేసే అధికారులను ఉపేక్షించేది లేదని, ప్రతి సమావేశంలో శాఖల పనితీరును సమీక్షించి బాధ్యత నిర్ధారిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పెద్దమందడి–ఖిల్లా ఘనపురం మండల మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు నవనీత, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి & జిల్లా హార్టికల్చర్ అధికారి విజయభాస్కర్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి యాదయ్య, ఎంఈఓ మంజుల, ఎంపీడీవో పరిణత, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

