*గ్రామ స్థాయిలో రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం: డీజీపీ సి.వి. ఆనంద్*
ఆదిలాబాద్ పర్యటనలో పలు అభివృద్ధి, అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్న డీజీపీ
పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
ఆదిలాబాద్, జూన్ 10:
రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) శ్రీ సి.వి. ఆనంద్ బుధ వారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి ప్రజా భద్రత, రోడ్డు భద్రత అవగాహన, మాదకద్రవ్యాల నియంత్రణ, సాంకేతిక ఆధారిత పోలీసింగ్ మరియు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా పోలీస్ అతిథి గృహంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో డీజీపీ పాల్గొని మొక్కలు నాటారు. ఆ తర్వాత చిల్డ్రన్ పార్క్ ను ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ను ప్రారంభించారు.
గాంజా, డ్రగ్స్ లాంటి మారకద్రవ్యాలకి బారిన పడిన వారికి కౌన్సిలింగ్ ఇస్తున్న అడిక్షన్ సెంటర్ ని సందర్శించారు.
*సేఫ్ ఆదిలాబాద్ లక్ష్యంగా సమీకృత సీసీటీవీల ఏర్పాటు*
ఆదిలాబాద్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సమీకృత సీసీటీవీ మానిటరింగ్ వ్యవస్థను డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్ ప్రారంభించారు. నాందేడ్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దుకు అనుసంధానంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా వ్యూహాత్మకంగా ఎంతో కీలకమని అధికారులు వివరించారు. ఈ ప్రాంతాల మధ్య వాహనాలు, ప్రజల రాకపోకలు అధికంగా ఉండటంతో ట్రాఫిక్ పర్యవేక్షణ, ప్రమాదాల నివారణ, నేరాల నియంత్రణ, ప్రజా భద్రత బలోపేతంలో సీసీటీవీ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
జిల్లా పోలీసులు చేసిన సీసీటీవీల ఏర్పాటును డీజీపీ అభినందించారు. హైదరాబాద్, సైబరాబాద్ నగరాల మాదిరిగా ఆదిలాబాద్ జిల్లాను కూడా సురక్షిత జిల్లాగా తీర్చిదిద్దాలని సూచించారు. జిల్లా కేంద్రాలతో పాటు చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌ను విస్తరించాలని అధికారులకు సూచించారు.
జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ఇటీవల 300 కొత్త సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఆదిలాబాద్ పట్టణంలో మొత్తం కెమెరాల సంఖ్య 600కు చేరిందని తెలిపారు. అలాగే జిల్లా గ్రామాల్లో 1,200కు పైగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటన్నింటినీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయడం ద్వారా ఘటనలపై తక్షణ స్పందన సాధ్యమవుతుందని వివరించారు.
*జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం*
జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసు అధికారులు, సిబ్బందితో డీజీపీ సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల నియంత్రణ, పట్రోలింగ్ వ్యవస్థ, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. నేర నియంత్రణలో ముందస్తు చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు.
పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, యువతకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు యాంటీ నార్కోటిక్స్ అండ్ సేఫ్టీ క్లబ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రతి పోలీసు అధికారి ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రతిరోజూ నిర్దిష్ట సమయాన్ని ప్రజల సమస్యల పరిష్కారానికి కేటాయించాలని ఆదేశించారు. పోలీసు-ప్రజల సంబంధాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
నేరాల దర్యాప్తులో పోలీసు డాగ్స్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కూడా సూచించారు.
*తోష గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం*
గుడిహత్నూర్ మండలంలోని తోష గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో డీజీపీ పాల్గొన్నారు. గ్రామసభలో గ్రామ పెద్దలు, సర్పంచ్, వార్డు సభ్యులు, యువతతో కలిసి మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
*ప్రతి గ్రామంలో రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేయాలి*
రోడ్డు భద్రత అనేది అందరి బాధ్యత అని పేర్కొన్న డీజీపీ, ప్రతి గ్రామంలో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని అర్హులైన వ్యక్తులకు పోలీసు, రవాణా శాఖల సహకారంతో లైసెన్సులు పొందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన రంగవల్లి పోటీలు, వాలీబాల్ టోర్నమెంట్ల విజేతలకు బహుమతులు అందజేశారు.
*సైబర్ నేరాలు, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాలు కొత్త సవాళ్లు*
తెలంగాణ ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద సమస్యను విజయవంతంగా ఎదుర్కొన్నప్పటికీ, ప్రస్తుతం సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, రోడ్డు ప్రమాదాలు కొత్త సవాళ్లుగా మారాయని డీజీపీ పేర్కొన్నారు.
గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో 7,800 మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని, హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా అనేక మరణాలను నివారించవచ్చని తెలిపారు. “వేగం ఉత్సాహాన్ని ఇవ్వొచ్చు, కానీ అదుపు కోల్పోతే ప్రాణాలను తీస్తుంది. ట్రాఫిక్ నిబంధనలను ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదు” అని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాద మరణాలు గణనీయంగా తగ్గాయని డీజీపీ కి జిల్లా ఎస్పీ వివరించారు. గత సంవత్సరం జనవరి నుంచి మే వరకు 72 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించగా, ఈ ఏడాది జనవరి – మే చివరి నాటికి సంఖ్య 48కు తగ్గిందన్నారు.
అవగాహన కార్యక్రమాలు, పోలీసు, రవాణా శాఖలు, జిల్లా యంత్రాంగం సమిష్టి కృషి వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. 24 మంది ప్రాణాలు కాపాడటం అంటే 24 కుటుంబాలను విషాదం నుంచి రక్షించినట్టేనని తెలిపారు.
*డ్రగ్స్ ప్రమాదాలపై హెచ్చరిక*
మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకప్పుడు వ్యవసాయం, పరిశ్రమలు, దేశ ఆర్థికాభివృద్ధిలో దేశంలో లో నంబర్ 1 స్థానంలో పంజాబ్ రాష్ట్రం డ్రగ్స్ ప్రభావంతో 21 స్థానానికి పడిపోయింది.
నేడు పంజాబ్ సామాజికంగా, ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. తెలంగాణ యువత అలాంటి పరిస్థితులు రాకుండా విద్య, ఉపాధి, ఆవిష్కరణలు, దేశ నిర్మాణం వైపు దృష్టి సారించాలని సూచించారు.
*సురక్షిత సమాజ నిర్మాణానికి అందరూ కలిసి పనిచేయాలి*
రోడ్డు భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాల్లో ప్రజలు చురుకుగా పాల్గొనాలని డీజీపీ పిలుపునిచ్చారు. జాతీయ రహదారుల వెంట భారీ వాహనాల అక్రమ పార్కింగ్‌ను అరికట్టేందుకు గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, యాంటీ నార్కోటిక్స్ చర్యలను మరింత బలోపేతం చేస్తోందని తెలిపారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, యువత కలిసి పనిచేసినప్పుడే డ్రగ్స్ రహిత, సురక్షిత, అభివృద్ధి చెందిన సమాజాన్ని నిర్మించగలమని డీజీపీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో డీజీ సీఐడీ & ఏసీబీ శ్రీమతి చారు సిన్హా, ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా, మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఇతర ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది, తోష గ్రామ సర్పంచ్ శ్రీమతి పద్మ, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
