ఆదివాసి అస్థిత్వ సమరంలో అడవి గుండె చప్పుడు
(ఆగష్టు 9న అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం సందర్భంగా పొలిటికల్ పవర్ న్యూస్ ప్రత్యేక వ్యాసం)
అడవితో మాట్లాడటం నాగరిక ప్రపంచానికి తెలియకపోవచ్చు, కానీ ఆదివాసీకి అదొక మాతృభాష. ఆగస్టు 9 అనగానే క్యాలెండర్లలో ఒక ఐక్యరాజ్యసమితి దినోత్సవం గుర్తొస్తుంది. ఉపన్యాసాలు, సదస్సులు, కొన్ని హామీలు.. మరుసటి రోజుకి మళ్లీ పాత చట్రమే. కానీ, ఆదివాసీల దినోత్సవాన్ని కేవలం ఒక జ్ఞాపకంగా కాకుండా, ఈ భూగోళం తనను తాను కాపాడుకోవడానికి వేసుకునే ఒక ‘ఆత్మపరిశీలన రోజు’గా చూడాల్సిన అవసరం వచ్చింది.
నాగరికత పేరిట జరుగుతున్న వైపరిత్యం
ఈ రోజున ప్రపంచం ఒక తీవ్రమైన వైరుధ్యాన్ని ఎదుర్కొంటోంది. ఒకవైపు వాతావరణ మార్పులతో భూమి కాలిపోతోందని కార్పొరేట్ వేదికలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు తరతరాలుగా ప్రకృతిని కాపాడుకుంటూ వస్తున్న మూలవాసులను వారి నేలల నుండి వెళ్లగొడుతున్నారు. ఆదివాసీల దృష్టిలో అడవి అనేది వ్యాపారం లేదా రియల్ ఎస్టేట్ కాదు. అదొక జీవజాల వ్యవస్థ. భూమిపై ఉన్న శతాబ్దాలనాటి జీవవైవిధ్యంలో 80 శాతానికి పైగా సంరక్షింపబడుతున్నది కేవలం ఆదివాసీల భూముల్లోనే అనేది ప్రపంచం గ్రహించాల్సిన పచ్చి నిజం.
అటవీ అధికారుల దౌర్జన్యాలతో సొంత నేలలోనే పరాయి వేదన
తరతరాలుగా అడవినే నమ్ముకుని, దానినే దైవంగా పూజిస్తూ బతుకుతున్న ఆదివాసీలు నేడు తమ సొంత నేలలోనే అభద్రతాభావంతో కాలం వెళ్లదీస్తున్నారు. సంరక్షణ పేరుతో ఫారెస్ట్ అధికారులు సాగిస్తున్న నిరంకుశ వైఖరి, దౌర్జన్యాలు గిరిజన ప్రాంతాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తరతరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో ట్రెంచులు తవ్వడం, పంటలను ధ్వంసం చేయడం, అడ్డొచ్చిన గిరిజనులపై ముఖ్యంగా ఆదివాసీ మహిళలపై దాడులకు తెగబడటం నిత్యకృత్యంగా మారింది. అటవీ సంరక్షణ చట్టాల వంకర భాషతో అడవి బిడ్డలను ఆక్రమణదారులుగా ముద్రవేస్తూ, అక్రమ కేసులు బానాయిస్తూ వారిని భయాందోళనలకు గురిచేస్తున్నారు. వ్యాపారాల కోసం అడవులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే యంత్రాంగం, అదే అడవిని ప్రాణప్రదంగా చూసుకునే మూలవాసులను మాత్రం నిందితులుగా వేధించడం పర్యవేక్షణ లోపానికి, వ్యవస్థీకృత అన్యాయానికి పరాకాష్ఠ.
*తెలుగు రాష్ట్రాల్లో ఐటిడిఎలు… ఆశయాల సాధనలో విఫలమవుతున్న వ్యవస్థలు*
తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ అటవీ ప్రాంతాల్లో ఆదివాసీల సమగ్ర అభివృద్ధి కోసం ఏర్పడిన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలు తమ ప్రాథమిక లక్ష్యాల నుంచి దారి తప్పుతుండటం ఆందోళనకరం. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల హక్కులను పరిరక్షించడం, విద్య, వైద్యం, తాగునీరు వంటి కనీస సదుపాయాలు అందించడం, జీవనోపాధి పెంచడమే లక్ష్యంగా ఇవి ఆవిర్భవించాయి. కానీ నేడు పాలనాపరమైన నిర్లక్ష్యం, నిధుల కొరత, రాజకీయ జోక్యం, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ ఐటీడీఏలు కేవలం అలంకారప్రాయంగా మారాయనే విమర్శలు బలంగా ఉన్నాయి. నేటికీ మారుమూల గూడెల్లో పోషకాహార లోపంతో పిల్లలు మరణించడం, పసికందులను, గర్భిణీ స్త్రీలను ఆస్పత్రులకు తీసుకెళ్లేందుకు డోలీ మోతలు తప్పకపోవడం, పోడు భూముల పట్టాల పంపిణీలో సాగుతున్న జాప్యం ఐటీడీఏల పనితీరుకు అద్దం పడుతున్నాయి. ఆదివాసీల అభ్యున్నతికి వెచ్చించాల్సిన ప్రజాధనం కాంట్రాక్టర్ల పాలుకావడం, పాలక యంత్రాంగం సమస్యలను పట్టించుకోకపోవడంతో ఈ సంస్థలు ఆదివాసీలకు కొండంత అండగా నిలవడంలో పూర్తిగా విఫలమవుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
*చట్టాలు వర్సెస్ క్షేత్రస్థాయి యథార్థం*
భారతదేశంలో ‘అటవీ హక్కుల చట్టం – 2006 లేదా పోడు భూముల హక్కులు కాగితాలపై గొప్పగానే కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో వారి జీవనోపాధి నిరంతరం ప్రశ్నార్ధకమవుతూనే ఉంది. తమ భూములకు, ఖనిజ వనరులకు తరతరాలుగా యజమానులైనప్పటికీ, మైనింగ్, భారీ డ్యామ్లు మరియు పారిశ్రామిక ప్రాజెక్టుల పేరుతో గిరిజనులు నిరాశ్రయులవుతున్నారు. అభివృద్ధి ఫలాలు పొందేది ఒకరైతే, దానికి మూల్యం చెల్లించేది మాత్రం ఆదివాసీలు. మాతృ భాషను, తరతరాల మూలికా వైద్య విజ్ఞానాన్ని పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను కోల్పోవడం అంటే ఒక జాతి చారిత్రాత్మక జ్ఞాన సంపదను సమూలంగా తుడిచిపెట్టడమే. ఆదివాసీల సంస్కృతిని కేవలం మ్యూజియంలకో లేదా పంద్రాగస్టు సాంస్కృతిక ప్రదర్శనలకో పరిమితం చేయడం సరైంది కాదు. ప్రకృతిని దెబ్బతీయకుండా ఎలా జీవించాలో చెప్పే వారి జీవన విధానాన్నే నేటి సుస్థిర అభివృద్ధికి ప్రామాణికంగా గుర్తించాలి.
*రేపటి ప్రపంచానికి ఏకైక మార్గం ఆదివాసీ తత్వం*
ఆదివాసీ సాంప్రదాయంలో నాది అనే భావన కంటే మనది అనే భావనే ఎక్కువ. భూమికి యజమాని మనిషి కాదు, మనిషి భూమిలో ఒక భాగం మాత్రమే అనే తత్వమే భూగ్రహాన్ని శతాబ్దాలుగా కాపాడింది. కార్పొరేట్ సంస్కృతి ప్రకృతేతర లాభాల కోసం పరిగెడుతుంటే, గిరిజన సమాజం రాబోయే ఏడు తరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అడవిని కాపాడేందుకు ఉపయోగిస్తుంది.
*ముగింపు కాదు… ఒక విజ్ఞప్తి*
ప్రకృతిని నిష్కారణంగా దోచుకోవడం నాగరికత అనిపించుకోదు. ప్రకృతితో మమేకమై సమతుల్యతతో జీవించడమే అసలైన నాగరికత. ఆదివాసీల భూమిని ఆచారాలను హక్కులను కాపాడటం అంటే ఏదో వారికి సహాయం లేదా దానం చేయడం కాదు. మన రాబోయే తరాలకు ప్రాణవాయువును నీటిని నివాసయోగ్యమైన భూమిని మిగల్చుకోవడమే. ఆగస్టు 9 కేవలం శుభాకాంక్షలకే పరిమితం కాకూడదు. అది ఆదివాసీల అస్తిత్వాన్ని స్వేచ్ఛను ఆత్మసాక్షిగా గౌరవించే ఒక ఆచరణాత్మక అడుగు కావాలి.

