పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక/ పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ నాగార్జునసాగర్ నియోజకవర్గ రిపోర్టర్ ఎండీ జహీరుద్దీన్ హలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి హాలియాలోని ఇబ్రహీంపేట పాత బ్రిడ్జి సమీపంలోని స్మశాన వాటికను సందర్శించి పరిశుభ్రత పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్మశాన వాటికలో పెరిగిన కంపచెట్లను జేసీబీ సహాయంతో తొలగించి, అక్కడ పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని మున్సిపల్ శానిటేషన్ సిబ్బందితో పూర్తిగా తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా చేయించారు. స్మశాన వాటికను ప్రజలందరికీ సౌకర్యవంతంగా, పరిశుభ్రమైన వాతావరణంలో ఉపయోగపడేలా అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకురావడానికి మున్సిపాలిటీ చర్యలు చేపడుతోందని తెలిపారు. అదేవిధంగా హాలియా పట్టణంలోని వ్యాపారస్తులు మరియు ప్రజలను ఉద్దేశించి, రోడ్లపై చెత్త వేయవద్దని సూచించారు. ప్రతిరోజూ సాయంత్రం మున్సిపల్ ట్రాక్టర్ ఇంటింటికీ, వ్యాపార ప్రాంతాలకు వచ్చి చెత్తను సేకరిస్తుందని, చెత్తను తప్పనిసరిగా మున్సిపల్ వాహనానికే అందించాలని కోరారు. రోడ్లపై లేదా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే సంబంధిత వ్యక్తులపై మున్సిపల్ నిబంధనల ప్రకారం జరిమానాలు విధించబడతాయని హెచ్చరించారు. “మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం… మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం” అనే సందేశంతో ప్రజలందరూ పరిశుభ్రత పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

