కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేసే వరకు కసిగా పనిచేయాలి: మెచ్చా.
పొలిటికల్ పవర్, ఆగస్టు 26,చండ్రుగొండ:అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ మెచ్చా నాగేశ్వరరావు చండ్రుగొండ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన పర్యటనతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొందని నాయకులు తెలిపారు.
ముందుగా అయ్యప్పస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మెచ్చా నాగేశ్వరరావు అనంతరం మద్దుకూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన బీఆర్‌ఎస్ పార్టీ దిమ్మను ఆవిష్కరించి పార్టీ జెండాను ఎగురవేశారు. గ్రామ పార్టీ కార్యాలయ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టారు. పార్టీ కార్యాలయానికి స్థలం ఇచ్చిన మంచినేని వెంకటేశ్వరరావును శాలువాతో సత్కరించారు.
చండ్రుగొండ మండల కేంద్రంలో జరిగిన వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం రావికంపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన బీఆర్‌ఎస్ పార్టీ దిమ్మను ఆవిష్కరించి పార్టీ జెండాను ఎగురవేశారు. దామరచర్ల గ్రామంలో గుండెపోటుతో మృతి చెందిన షేక్ నాగుల్ మీరా పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారని, వారి శ్రమను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని పేర్కొన్నారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని మెచ్చా అన్నారు. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు గ్రామాల్లో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కోరారు.
అలాగే బీఆర్‌ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావుపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసిందని, ఈ పరిణామం అనంతరం నిజం గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. రేగా కాంతారావు నాయకత్వంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
కార్యక్రమాల్లో మాజీ మండల అధ్యక్షులు దారా బాబు, బోయినపల్లి సుధాకర్‌రావు, మాజీ జడ్పీటీసీ వెంకటరెడ్డి, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, వివిధ గ్రామాల బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

