ePaper
Monday, September 7, 2026
📄 ePaper
Homeతెలంగాణరైతుబీమా బంద్ అయింది..!

రైతుబీమా బంద్ అయింది..!

📰 Generate e-Paper Clip

అన్నదాత కుటుంబాలకు అండగా నిలిచిన రూ.5 లక్షల భరోసా నిలిపివేత

రైతు కుటుంబాలను ఆదుకునే పథకాన్ని కొనసాగించాలంటున్న అన్నదాతలుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /పిఏన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ సెప్టెంబర్ 05 2026: నాగర్ కర్నూల్ రైతు కుటుంబాలకు ఆపత్కాలంలో అండగా నిలిచిన రైతుబీమా పథకం నిలిచిపోయిందనే ఆరోపణలు తెలంగాణలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబీమా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసిందని ప్రతిపక్షాలు, రైతు సంఘాల నాయకులు విమర్శలు చేస్తున్నారు. దీంతో కుటుంబ పెద్దను కోల్పోయిన రైతు కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆరోపిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బర్కత్‌పల్లి గ్రామానికి చెందిన 45 ఏళ్ల దళిత రైతు ఒర్సు రాంచందర్ గత నెల 29న గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు అర ఎకరం వ్యవసాయ భూమితో పాటు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి ప్రధాన ఆధారమైన రాంచందర్ ఆకస్మిక మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

రూ.5 లక్షల కోసం ఏఈఓను ఆశ్రయించిన కుటుంబం

రాంచందర్ మిత్రులు, కుటుంబ సభ్యులు రైతుబీమా కింద లభించే రూ.5 లక్షల పరిహారం కోసం స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారిని (ఏఈఓ) సంప్రదించినట్లు సమాచారం. అయితే రైతుబీమా పథకం ఆగస్టు 14 నుంచి నిలిచిపోయిందని, ఈ మరణానికి బీమా క్లెయిమ్ వర్తించదని అధికారులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఏళ్లుగా రైతు కుటుంబాలకు ఆపద సమయంలో ఆర్థిక భరోసాగా నిలిచిన రైతుబీమా అందదనే విషయం తెలియడంతో రాంచందర్ కుటుంబం ఒక్కసారిగా కుంగిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

2018లో ప్రారంభమైన రైతుబీమా

2018 ఆగస్టు 15న అప్పటి తెలంగాణ ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని ప్రారంభించింది. రైతు పేరిట కనీసం గుంట వ్యవసాయ భూమి ఉన్నా పథకం వర్తించేలా నిబంధనలు రూపొందించినట్లు బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రైతు మరణించిన సందర్భంలో కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశంగా ఉంది. 2018-19 నుంచి 2025-26 వరకు 1,86,363 మంది రైతులు మరణించగా, వారి కుటుంబాలకు రూ.9,107.80 కోట్ల మేర పరిహారం అందించినట్లు సంబంధిత గణాంకాలను ఉటంకిస్తూ బీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే రైతుబీమా పరిధిలో సుమారు 42.16 లక్షల మంది రైతుల కోసం ఏటా రూ.1,400 కోట్ల వరకు ప్రీమియం చెల్లిస్తూ వచ్చినట్లు వెల్లడిస్తున్నాయి.

కొనసాగించాలనే డిమాండ్

రైతుబీమా పథకం నిలిపివేతతో ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో కనీస ఆర్థిక భరోసా లేకపోతే పిల్లల చదువులు, కుటుంబ పోషణ, అప్పుల చెల్లింపులు వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయని పేర్కొంటున్నారు. రైతుబీమా పథకాన్ని తక్షణమే పునరుద్ధరించి, అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక భరోసా కల్పించాలని రైతులు, రైతు కుటుంబాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే రైతుబీమా పథకం నిజంగా ఏ తేదీ నుంచి నిలిచిపోయింది, ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటి, పెండింగ్ క్లెయిమ్‌ల పరిస్థితి ఏమిటన్న అంశాలపై ప్రభుత్వం నుంచి అధికారిక వివరణ రావాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!