
పొలిటికల్ తెలుగు జాతీయ దినపత్రిక ఎన్ ఆర్ 9టీవీ న్యూస్ ( ఆర్సి కారం వెంకటేష్ అక్టోబర్ 30: ములకలపల్లి మండలం సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో జిల్లాఎస్పీ ఆదేశాల మేరకు విద్యార్థినుల్లో డిజిటల్ చైతన్యం తెచ్చేలా, రక్షణకు భరోసా కల్పిస్తూ నిర్వహించిన పోలీస్ అక్క కార్యక్రమం పాఠశాలలో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. నేటి డిజిటల్ యుగంలో ఎదురవుతున్న సైబర్ ముప్పులు, లైంగిక వేధింపుల నివారణ మరియు స్వీయ రక్షణ పద్ధతులపై పోలీసులు విద్యార్థినులకు విలువైన అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై మధు ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ ఎన్. సుధాకర్ రావు, పీసీ వర ప్రసాద్, డబ్ల్యూపీసీ లక్ష్మి తదితర పోలీసు సిబ్బంది పాల్గొని విద్యార్థినులతో ముచ్చటించారు. ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా వాడకంలో విద్యార్థినులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, ఆన్లైన్ మోసాల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలో హెడ్ కానిస్టేబుల్ ఎన్. సుధాకర్ రావు వివరించారు. ఆపద సమయంలో లేదా ఎవరైనా వేధింపులకు పాల్పడినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో పీసీ వర ప్రసాద్, డబ్ల్యూపీసీ లక్ష్మి ప్రాథమిక స్వీయ రక్షణ మెళకువలను విద్యార్థినులకు చేసి చూపించారు.కొన్ని దృశ్యాలను చూపిస్తూఅవగాహన కల్పించారు. పాఠశాల ప్రిన్సిపాల్ జి. సునీత ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు బాలికల్లో ఆత్మవిశ్వాసాన్ని, భద్రతా భావాన్ని పెంపొందిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ అవగాహన సదస్సులో ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని సైబర్ నేరాల నివారణపై ప్రతిజ్ఞ చేశారు. ఆపద సమయంలో తక్షణ సహాయం కోసం డయల్ 112 నంబర్లను సంప్రదించాలని పోలీసులు ఈ సందర్భంగా సూచించారు.

