
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ సిహెచ్ కిషోర్
కొత్తగూడెం : దేశ ఐక్యత, సమగ్రత కోసం నిరంతరం పరితపించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన అంకితభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ అన్నారు. భారత తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను పురస్కరించుకుని శనివారం కొత్తగూడెం నగర పాలక సంస్థ కార్యాలయంలో పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యానంతరం దేశంలో చెల్లాచెదురుగా ఉన్న అనేక సంస్థానాలను ఒక్కటిగా ఏకం చేసి, అఖండ భారతదేశ నిర్మాణానికి పటేల్ చేసిన విశేష కృషి చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. దేశ సమైక్యత పరిరక్షణలో ఆయన ప్రదర్శించిన ధైర్యసాహసాలు, దార్శనికత అద్భుతమైనవని పేర్కొన్నారు. జాతి సమగ్రత కోసం జీవితాంతం పనిచేసిన పటేల్ ఆశయాలను స్మరించుకుంటూ, వాటిని భావితరాలకు అందించేలా ముందుకు సాగాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ సుజాత, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

