ePaper
Wednesday, November 4, 2026
📄 ePaper

గేదెల కొనుగోళ్లలో భారీ గోల్‌మాల్‌!మహిళా డెయిరీ పథకానికి దళారుల గ్రహణం..అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలా ?

📰 Generate e-Paper Clip

  కొనుగోలు కేంద్రం మార్పు.. కమీషన్ల ఆరోపణలు

కలెక్టర్ ఆగ్రహం..విచారణకు ఆదేశం.. బాధ్యులపై సస్పెన్షన్ వేటు!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక ఎన్ వి ఆర్ టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఎన్ శివకుమార్
/బోనకల్: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులను చేయాలనే ఉన్నత లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిర మహిళా డెయిరీ పథకానికి దళారుల గ్రహణం పట్టిందా? మహిళా లబ్ధిదారులకు నాణ్యమైన పాడి గేదెలను అందించాల్సిన కొనుగోళ్ల ప్రక్రియ కమీషన్ల కాసుల వేటగా మారుతోందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మధ్యవర్తుల జోక్యం, కొనుగోలు కేంద్రాల మార్పు, అధికారుల పర్యవేక్షణ లోపాలు, కమీషన్ల డిమాండ్లపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు పథకం అమలుతీరుపై తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి. బోనకల్ మండలంలో వెలుగుచూసిన ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ దివాకర ఆగ్రహం వ్యక్తం చేసి విచారణకు ఆదేశించడంతో అధికారుల్లో కలవరం మొదలైంది.

దళారుల కనుసన్నల్లో కొనుగోళ్లు!

బోనకల్ మండలానికి చెందిన అధికారుల బృందం గత శనివారం (31వ తేదీ) లబ్ధిదారులతో కలిసి గేదెల కొనుగోలు కోసం పశ్చిమగోదావరి జిల్లాకు బయలుదేరింది. ఈ బృందానికి కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన ఓ మధ్యవర్తి బస్సు ఏర్పాటు చేయడం తొలుత అనుమానాలకు తావిచ్చింది. ఉన్నతాధికారులు ముందుగా పశ్చిమగోదావరి జిల్లా ఉండి పట్టణాన్ని కొనుగోలు కేంద్రంగా నిర్ణయించగా, అక్కడికి వెళ్లాల్సిన బృందాన్ని మధ్యవర్తి తాడేపల్లిగూడెం తీసుకెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయించిన ప్రాంతాన్ని కాదని ప్రైవేటు వ్యక్తి సూచించిన ప్రాంతంలో కొనుగోళ్లు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వైద్యాధికారి రాకముందే కొనుగోళ్ల తంతు!

గేదెల ఆరోగ్య పరిస్థితి, నాణ్యతను పరిశీలించి కొనుగోలుకు అనుమతించాల్సిన పశువైద్యాధికారి ఆలస్యంగా చేరుకోవడం ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం. ఆయన వచ్చేలోపే అధికారుల బృందంలోని వెలుగు సీసీ అన్నీ తానై కొనుగోలు ప్రక్రియను నడిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 25 గేదెల కొనుగోలుకు వెళ్లగా, పశువైద్యాధికారి చేరుకునే సమయానికి 22 గేదెల కొనుగోళ్లు పూర్తయినట్లు సమాచారం. అంటే వైద్యాధికారి ప్రత్యక్ష పర్యవేక్షణ లేకుండానే మెజారిటీ కొనుగోళ్లు జరిగాయా? గేదెల నాణ్యత, ఆరోగ్య పరిస్థితిని ఎవరు నిర్ధారించారు? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాధనంతో అమలవుతున్న పథకంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కమీషన్ల కక్కుర్తి.. లబ్ధిదారులకు నాణ్యతలేని గేదెలా?

గేదెల కొనుగోళ్ల వ్యవహారంలో మధ్యవర్తుల సంఖ్య పెరుగుతోందని, ఒక్కొక్క గేదె కొనుగోలుపై కమీషన్ల బేరసారాలు సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారులు గేదెకు రూ.5 వేల వరకు డిమాండ్ చేస్తున్నారనే విమర్శలు కూడా తెరపైకి వచ్చాయి. మధ్యవర్తుల కమీషన్లు, ఇతర అక్రమ వసూళ్ల భారం చివరకు మహిళా లబ్ధిదారులపైనే పడుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించాల్సింది పోయి, దళారుల జేబులు నింపే వ్యవస్థగా మారితే ప్రభుత్వ లక్ష్యం ఎలా నెరవేరుతుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

కలెక్టర్ సీరియస్.. విచారణకు ఆదేశం!

ఈ వ్యవహారం సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ దివాకర దృష్టికి వెళ్లడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు కేంద్రాన్ని మార్చిన వ్యవహారంపై తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులను సస్పెండ్ చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజను ఆదేశించారు. అనంతరం అదనపు కలెక్టర్ పశుసంవర్ధక శాఖ అధికారులు, పశువైద్యులతో జూమ్ సమావేశం నిర్వహించి కొనుగోళ్ల తీరుపై వివరాలు సేకరించారు.

మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రూపొందించిన ప్రతిష్ఠాత్మక పథకంలోనే అక్రమాల ఆరోపణలు రావడం ప్రభుత్వ లక్ష్యానికి విఘాతం కలిగించే పరిణామం. కొనుగోలు కేంద్రాన్ని మార్చిన వారెవరు? మధ్యవర్తులకు అండగా నిలిచిందెవరు? వైద్యాధికారి రాకముందే కొనుగోళ్లకు పచ్చజెండా ఊపిందెవరు? కమీషన్ల ఆరోపణల్లో వాస్తవమెంత? అన్న అంశాలపై సమగ్ర విచారణ జరగాల్సి ఉంది. కేవలం విచారణతో సరిపెట్టకుండా అక్రమాలకు పాల్పడినట్లు తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లబ్ధిదారులకు నాణ్యమైన గేదెలు అందేలా చూడాలని మహిళలు కోరుతున్నారు.

Latest Articles

మొగరలగుప్ప మూకమామిడి మధ్య వంతెన కూలిపోయి రాకపోకలకు అంతరాయం

వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన రెస్క్యూ  టీం మూకమామిడి ప్రాజెక్ట్ పూర్తిస్థాయి...

అలుగు ఉధృతికి రహదారి జలమయం.. భద్రాచలం మార్గంలో ట్రాఫిక్‌ నిలిపివేత

కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు అందుబాటులో డిడిఆర్ఎఫ్ బృందాలు:...

కుర్చీకే పరిమితం కాని అధికారి.. ప్రజల మధ్యే దమ్మపేట తహశీల్దార్‌ మురళి

ఆపదలో ప్రజలకు అండగా.. ఆదర్శంగా నిలిచిన దమ్మపేట తహసిల్దార్! తుపాను వేళ క్షేత్రస్థాయిలో పర్యటన.....

తుఫాను వేళ ప్రజల చెంతకు.. మందలపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్ చొరవ

వరద నీటితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు అండ పొలిటికల్ పవర్,దమ్మపేట, నవంబర్...

భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి:ఏఐయూకేఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము

పంట నష్టంపై తక్షణ సర్వే చేపట్టి పరిహారం అందించాలిపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి...

Related Articles

అలుగు ఉధృతికి రహదారి జలమయం.. భద్రాచలం మార్గంలో ట్రాఫిక్‌ నిలిపివేత

కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు అందుబాటులో డిడిఆర్ఎఫ్ బృందాలు: ఎస్సై సాయి కిషోర్ రెడ్డిపొలిటికల్ పవర్, ఆర్సి ఇంచార్జ్ ఎం.నాగార్జున,    అశ్వారావుపేట, అక్టోబర్ 4:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట...

కుర్చీకే పరిమితం కాని అధికారి.. ప్రజల మధ్యే దమ్మపేట తహశీల్దార్‌ మురళి

ఆపదలో ప్రజలకు అండగా.. ఆదర్శంగా నిలిచిన దమ్మపేట తహసిల్దార్! తుపాను వేళ క్షేత్రస్థాయిలో పర్యటన.. వరద బాధితులకు సహాయక చర్యలుదమ్మపేట, నవంబర్ 4: ప్రభుత్వ ఉద్యోగి అంటే కార్యాలయాలకే పరిమితమనే అభిప్రాయానికి భిన్నంగా, ప్రజల కష్టాల్లో...

తుఫాను వేళ ప్రజల చెంతకు.. మందలపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్ చొరవ

వరద నీటితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు అండ పొలిటికల్ పవర్,దమ్మపేట, నవంబర్ 4: తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు దమ్మపేట మండలం మందలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాలు వరద నీటితో...
error: Content is protected !!