
గార్ల / ఇల్లందు (పొలిటికల్ పవర్ ప్రతినిధి, మాలోత్ అజయ్ నాయక్):
గత 20 ఏళ్లుగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నిస్వార్థంగా వైద్య సేవలందిస్తున్న ఆశా కార్యకర్తల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) గార్ల మండల నాయకులు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోరం కనకయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు.
డిసెంబర్ 15 నుంచి సమ్మె సైరన్:
ఈ సందర్భంగా యూనియన్ మండల నాయకురాలు పి. రమాదేవి మాట్లాడుతూ.. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆశా కార్యకర్తలు డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సమ్మె నోటీసు కూడా అందజేసినట్లు పేర్కొన్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవే:
* ఆశా వర్కర్లకు నెలకు రూ. 18,000 కనీస వేతనం చెల్లించాలి.
* 2వ పీఆర్సీలో రూ. 30,000 కనీస వేతనం అమలు చేయాలి.
* ఉద్యోగ భద్రతతో పాటు రూ. 50 లక్షల ఇన్సూరెన్స్, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి.
* రూ. 5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్, వేతనంతో కూడిన సెలవులు, అర్హతను బట్టి ప్రమోషన్లు ఇవ్వాలి.
ఈ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని ఎమ్మెల్యే కనకయ్యకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు పుష్ప, ఆశాకుమారి, నీల, అరుణ, వీరమ్మ, హైమావతి, రాణి, కళావతి, సుజాత, యశోద, శాంతి, రాధ, రేవతి, రమణ, రత్తమ్మ, సిరి, మంగతాయి తదితరులు పాల్గొన్నారు.

