ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్*యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP ) గొడ్డలి పార్టీ అయితే, మనది కాంగ్రెస్...

*యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP ) గొడ్డలి పార్టీ అయితే, మనది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం గా నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ రాబందుల పార్టీనా..?*

📰 Generate e-Paper Clip

 

*తెలుగుదేశం పార్టీలో అసలు నిజమైన కార్యకర్తకు, పార్టీ కోసం కష్టపడే నేతకు గుర్తింపు ఏది..?*

*పక్క పార్టీ నుంచి వచ్చిన అవినీతి, అక్రమాల నేతలకు టీడీపీ లో అందలం సమంజసమా..?*

*అవినీతి అక్రమాలతో టీడీపీ పార్టీ పరువు తీస్తున్న అవినీతి రౌడీ నేతలపై చర్యలు ఎక్కడ..?*

*తెదేపా నేతలకు ఎన్టీఆర్ జిల్లా మైలవరం మాజీ ఎమ్మెల్యే జ్యేష్ట రమేష్ బాబు సూటి ప్రశ్నలు*

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి మైలవరం, ఆగస్టు 10: వారిది గొడ్డలి పార్టీ అయితే నిజమైన కార్యకర్తలను బలి పశువులను చేస్తున్న మనది రాబందుల పార్టీయా అని మైలవరం మాజీ ఎమ్మెల్యే జ్యేష్ట రమేష్ బాబు సూటిగా ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న కొన్ని సంఘటనలు, పరిణామాలను ఉటంకిస్తూ మాజీ ఎమ్మెల్యే జ్యేష్ట రమేష్ బాబు తెదేపాలోని నేతల తీరును తీవ్రంగా తప్పు పట్టారు. నేతలు ప్రవర్తిస్తున్న తీరుకు తెలుగుదేశం పార్టీలో ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడుతూ, ప్రాణాలను త్యాగం చేస్తున్న నిజమైన కార్యకర్తలను కాదని అవినీతిపరులకు అందలం ఎక్కిస్తున్న తీరుతో పార్టీ ఎటువంటి మెసేజ్ ను పార్టీ శ్రేణులకు అందిస్తుందో అర్థమవుతుందన్నారు. పేదవాడికి అందాల్సిన బియ్యం డబ్బులతో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించామని బహిరంగంగా కొట్లాడుకున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)పై పార్టీ ఎటువంటి చర్యలు తీసుకుందో చెప్పాలని రమేష్ బాబు డిమాండ్ చేశారు. 100 కోట్ల రూపాయలకు టిడిపి అధిష్టానం అసెంబ్లీ సీటు అమ్ముకుందని ఒక మాజీ మంత్రి బహిరంగంగా ఆరోపణలు చేస్తే ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఆయనకు సీటు ఇవ్వకుండా ఆయన ప్రత్యర్థి, పొరుగు పార్టీ నుంచి వలస వచ్చిన నేతకు సీటు ఇచ్చిన ఘనత తెదేపా అధిష్టానానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ టెండరు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసుతో కేంద్ర ప్రభుత్వం తెదేపాకు వ్యతిరేకమైన వ్యక్తికి కట్టబెట్టిందని గన్నవరం ఎమ్మెల్యే బహిరంగంగా సొంత పార్టీపై విమర్శలు చేస్తే పార్టీ అధినాయకత్వం ఎటువంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. మైలవరం నియోజకవర్గంలో వీటీపీఎస్ నుంచి వచ్చే బూడిద అక్రమ వ్యాపారం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కే చెందుతుందని ఎమ్మెల్యే, ఎంపీ బహిరంగంగా ప్రకటించినా వారిపై అధినాయకత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదో నేటికీ కార్యకర్తలకు అర్థం కాని విషయం అన్నారు. పార్టీ కోసం కష్టపడుతూ త్యాగాలు చేస్తున్న నిజమైన తెలుగుదేశం కార్యకర్తలకు గానీ, నేతలకు గానీ పార్టీలో సముచితమైన స్థానం, గుర్తింపు లేదనేది స్పష్టమవుతుందన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో నిజాయితీగా, పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పనిచేసిన తనతోపాటు గుడివాడకు చెందిన రావి వెంకటేశ్వరరావు, గన్నవరానికి చెందిన దాసరి బాలవర్ధనరావు, అప్పట్లో పార్టీకి కోట్లాది రూపాయలు సాయం చేసిన దాసరి జై రమేష్ లను తెదేపా అధిష్టానం బలి పశువులను చేసింది. నియోజకవర్గాల అభివృద్ధికి నిష్పక్షపాతంగా అంకిత భావంతో పనిచేస్తున్న మమ్మల్ని కాదని పార్టీ అధినాయకత్వాన్ని బూతులు తిట్టే వ్యక్తులను తీసుకొచ్చి సీట్లు ఇచ్చి నిలబెట్టింది. మేము చేసిన పాపం ఏమిటో పార్టీ అధినాయకత్వం చెప్పకుండా తప్పించుకుంది. మరీ విడ్డూరంగా నేడు పార్టీని నాశనం చేసే అవినీతి రౌడీ నేతలను పొరుగు పార్టీ నుంచి రప్పించుకుంటున్నారు. ఇదిలా ఉంటే నిష్పక్షపాతంగా పార్టీ కోసం కష్టపడి పని చేస్తూ విజయ డైరీని లాభాల బాటలో నడిపిస్తూ విజయ డైరీ చైర్మన్ గా మరోమారు తాజాగా, ఏకగ్రీవంగా ఎన్నికైన చలసాని ఆంజనేయులు ఏం నేరం చేశారని ఆయనను పదవి నుంచి రాజీనామా చేయించారో పార్టీ నాయకత్వం నిజమైన కార్యకర్తలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో సైతం విజయ డైరీ చైర్మన్ గా సంస్థ అభివృద్ధి కోసం అంకితభావంతో నిష్పక్షపాతంగా పనిచేసిన మండవ జానకి రామయ్యను సైతం పార్టీ అధిష్టానం ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. తెదేపాకు చెందిన ఆయనను ఆ పదవి నుండి తప్పించేందుకు అనేక కుట్రలు చేసింది. కానీ ఆయన నీతికి, నిజాయితీకి కట్టుబడి పనిచేసి పార్టీ కుట్రలను తిప్పి కొట్టి సంస్థ అభివృద్ధి కోసం అదే పదవిలో కొనసాగారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయ పరంగా తనకున్న సమయస్ఫూర్తితో ఆయన తెదేపా అధిష్టానాన్ని ధిక్కరించి సంస్థ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. కానీ చలసాని ఆంజనేయులు ఆర్థికంగా, రాజకీయంగా బలహీనుడు అవ్వటం వలన పార్టీ అధిష్టాన నిర్ణయానికి బలయ్యారు. దీనిని బట్టి తెలుగుదేశం పార్టీలో ప్రజాస్వామ్యానికి స్థానం లేదని, పొరుగు పార్టీ నుంచి వచ్చిన అవినీతిపరులకు అధిక ప్రాధాన్యత ఉంటుంది అనే విషయం బోధపడుతుందన్నారు. మొన్నటి వరకు పొరుగు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను అవినీతిపరులు, అక్రమార్కులు అని ముద్ర వేసిన తెలుగుదేశం నేతలు ప్రస్తుతం పొరుగు పార్టీలో ఉన్న అవినీతిపరులను, అక్రమార్కులను తెదేపాలోకి చేర్చుకొని వారికే పదవులు కట్టబెట్టారు. వీరిలో ప్రధానంగా కృష్ణా జిల్లాకు చెందిన కొలుసు పార్థసారధికి ఏకంగా మంత్రి పదవినే కట్టబెట్టింది. అదేవిధంగా గన్నవరం ఎమ్మెల్యేకు పార్టీ విప్ పదవిని, మైలవరం ఎమ్మెల్యేకు రాష్ట్ర అధికార ప్రతినిధి పదవిని కట్టబెట్టిన పార్టీ అధిష్టానం నిజమైన కార్యకర్తలకు, నాయకులకు తీరని ద్రోహం చేసింది. ఇదే క్రమంలో పార్టీకి అంకితభావంతో పని చేస్తూ పదవి వచ్చినా, రాకపోయినా పార్టీ అభివృద్ధికి, అభ్యర్థుల గెలుపు కోసం త్యాగాలు చేస్తున్న అనేకమంది కార్యకర్తలు, నాయకులు పార్టీ చర్యలకు, పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుకు బలి పశువులుగా మారుతున్నారు. అనేకమంది నిజమైన కార్యకర్తలు, నాయకులు పార్టీ చర్యలను తట్టుకోలేక తల్లి లాంటి పార్టీని విడిచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఇదేనా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ప్రజాస్వామ్యం. మాటిమాటికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే తెదేపా అధినాయకత్వం వారు వ్యవహరిస్తున్న తీరుపై ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీ అనుసరిస్తున్న, వ్యవహరిస్తున్న చర్యలకు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది. మాటిమాటికి పొరుగు పార్టీని గొడ్డలి పార్టీ అని సంబోధించే తెదేపా నేతలు బ్రతికుండగానే తమ స్వార్థం కోసం స్వలాభం కోసం నిజమైన తెదేపా కార్యకర్తలను నాయకులను రాబందుల మాదిరిగా పీక్కుతింటూ వారిని బలి పశువులను చేస్తున్న మన పార్టీని రాబందుల పార్టీ అనాలా అని జ్యేష్ట రమేష్ బాబు ప్రశ్నించారు*.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!