దమ్మపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించిన మంత్రి సీతక్క
మహిళలు కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ఆర్థికంగా స్వావలంబన సాధించాలి
మహిళా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
రుణాలను సద్వినియోగం చేసుకుని ఆదాయం వచ్చే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలి
స్థానిక వనరులను ఆదాయ వనరులుగా మలుచుకుని మార్కెటింగ్‌పై దృష్టి సారించాలి
మహిళా సంఘాలు ఐక్యత, క్రమశిక్షణతో ముందుకు సాగాలి
దమ్మపేట, ఆగస్టు 9:ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క), అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదివారం అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ముందుగా అశ్వారావుపేటలోని గిరిజన విద్యా వికాస కేంద్రంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో SDF 2025-26 నిధులతో రూ.25 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు.
అనంతరం దమ్మపేట మండలం మారెప్పగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని చీపురుగూడెం గ్రామంలో 10 లక్షల నిర్మాణం వ్యయం తో నిర్మించిన స్వయం శక్తి గ్రామ మహిళా సంఘం భవనాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పాయం రమాదేవి తదితరుల గృహప్రవేశ కార్యక్రమాల్లో మంత్రి సీతక్క పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని మంత్రి తెలిపారు .
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో దమ్మపేట మండలం నాచారం గ్రామపంచాయతీ పరిధిలో రూ.1 కోటి అంచనా వ్యయంతో నాచారం గ్రామంలోని సీసీ రోడ్డు నుంచి పల్లె ప్రకృతివనం, సీతారాంపురం వరకు నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. అనంతరంనాగుపల్లి గ్రామంలో కేరళ తరహాలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని మంత్రి సీతక్క పరిశీలించారు. భవన నిర్మాణం, చిన్నారులకు కల్పించిన వసతులు, పరిసరాలు, మౌలిక సదుపాయాలను పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాలను చిన్నారులకు ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంతో పాటు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. నాగుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామంలో రూ.12 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని గర్భిణీ మహిళలకు మంత్రి సీతక్క చేతుల మీదుగా శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణీ మహిళలకు పౌష్టికాహారం అందించడం, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించడం, తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, ఇతర సేవలను మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ, అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.
మహిళలు జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని మంత్రి అన్నారు. ఇందిరాగాంధీ జీవితాన్ని మహిళలు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంగా నిలబడి దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎదిగిన ఇందిరాగాంధీని ‘ఐరన్ లేడీ’గా దేశం గుర్తించిందని తెలిపారు. అదే స్ఫూర్తితో ప్రతి మహిళ కూడా కష్టాలను అధిగమించి ఉక్కు మహిళగా ఎదగాలని ఆకాంక్షించారు.
కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇతర సవాళ్లు ఎదురైనప్పుడు మహిళలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని మంత్రి సూచించారు. కష్టాలు వచ్చినప్పుడు నిరాశ చెందకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకోవాలని అన్నారు. మహిళలు ఐక్యంగా ఉండి పరస్పరం సహకరించుకోవాలని సూచించారు.
మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి తమ కుటుంబాలను అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మహిళలకు మౌలిక వసతులు, ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8 వేల గ్రామ సంస్థలకు (VOలకు) భవనాల కల్పనకు చర్యలు చేపడుతున్నామని మంత్రి చెప్పారు. మహిళా సంఘాల భవనాలను కేవలం సమావేశాలకు పరిమితం చేయకుండా శిక్షణ, ఉత్పత్తి, స్వయం ఉపాధి, మార్కెటింగ్, ఇతర ఆర్థిక కార్యకలాపాలకు వినియోగించుకోవాలని సూచించారు.
మహిళా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున బ్యాంకు లింకేజీలు అందించినట్లు తెలిపారు . మహిళల పేరుతో రుణాలు అందించి వారు స్వయం ఉపాధి, చిన్నతరహా పరిశ్రమలు, ఉత్పత్తి కార్యకలాపాలు చేపట్టి ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.
రుణాలను వృథా చేయకుండా ఆదాయం వచ్చే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి సూచించారు. ప్రారంభ దశలో కొంత కష్టంగా అనిపించినప్పటికీ క్రమశిక్షణతో, ఐక్యంగా కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులో మహిళలు, వారి కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడతాయని అన్నారు.
ప్రతి ప్రాంతంలో అందుబాటులో ఉన్న స్థానిక వనరులను గుర్తించి వాటిని ఆదాయ వనరులుగా మార్చుకోవాలని మంత్రి సూచించారు. కారం పొడి, పసుపు, మామిడి ఆధారిత ఉత్పత్తులు, కోళ్ల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం, చిన్నతరహా యంత్రాల ఏర్పాటు వంటి కార్యక్రమాలను మహిళా సంఘాలు చేపట్టవచ్చని తెలిపారు. గ్రామాల్లో తయారు చేసే ఉత్పత్తులకు స్థానిక మార్కెట్‌తో పాటు హైదరాబాద్, ఇతర పట్టణాలు, ఇతర ప్రాంతాల్లో మార్కెటింగ్ అవకాశాలను కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
మహిళలు ఎవరి మీద ఆధారపడకుండా తమ స్వశక్తితో సంపాదించి కుటుంబాలను నడిపించే స్థాయికి ఎదగాలని మంత్రి అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, రుణాలు, శిక్షణ, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గ్రామాల్లోని పేద, నిరుపేద, వితంతువులు, వికలాంగులు, సికి సెల్ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి ప్రభుత్వ అందించే ఆసరా పెన్షన్లు అందేలా మహిళా సంఘాలు సహకరించాలని మంత్రి కోరారు. ముఖ్యంగా అర్హులైన వారికి పింఛన్లు అందేలా జాబితాలను సక్రమంగా రూపొందించి ఎంపీడీఓల ద్వారా సంబంధిత అధికారులకు అందించాలని సూచించారు.
మహిళా సంఘాల ద్వారా ఉపాధి అవకాశాలు పెంచుతున్నాం : అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గానికి విచ్చేసిన మంత్రి సీతక్కకు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహిళా సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో మంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు.
గతంలో డ్వాక్రా మహిళలు చెట్ల కింద సమావేశాలు నిర్వహించుకునే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం మహిళా సంఘాలకు సొంత భవనాలు అందుబాటులోకి రావడం ఎంతో సంతోషకరమని ఎమ్మెల్యే అన్నారు. మహిళా సంఘాలకు భవనాలు, వడ్డీ లేని రుణాలు, సోలార్ పవర్ ప్లాంట్లు, వివిధ ఉపాధి కార్యక్రమాలు అందుబాటులోకి రావడం ద్వారా మహిళలకు స్థిరమైన ఆదాయ అవకాశాలు ఏర్పడుతున్నాయని తెలిపారు.
అశ్వారావుపేటలో మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దమ్మపేటలో తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, పోలీస్ స్టేషన్ తదితర ప్రాంతాలకు వచ్చే ప్రజలకు ఉపయోగపడేలా మహిళా సంఘాల ద్వారా సేవలు అందించే కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు.
అశ్వారావుపేట మండలానికి మహిళా శక్తి కార్యక్రమాల కోసం రూ.30 కోట్ల మేర నిధులు, ములకలపల్లి, అనపర్తిపల్లి, చండ్రకొండ ప్రాంతాలకు రూ.15 కోట్ల చొప్పున నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆయా ప్రాంతాల్లో కోళ్ల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం, చిన్నతరహా యంత్రాల ఏర్పాటు తదితర కార్యక్రమాలను మహిళా సంఘాల ద్వారా చేపట్టి ఆదాయాన్ని పెంచుకునేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహిళా శక్తి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లడంలో మొలకలపల్లి మండలం ముందంజలో ఉందని తెలిపారు.
మహిళా సంఘాలకు స్థిరమైన ఆదాయ వనరుల కల్పనకు చర్యలు : కలెక్టర్ అంకిత్
జిల్లాలో మహిళా సంఘాల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్మిస్తున్న 357 ఇందిరమ్మ మహిళా శక్తి భవనం పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేసి వచ్చే నెలలో కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
మహిళా సంఘాలకు ఆదాయ వనరులు కల్పించేందుకు చేపడుతున్న సోలార్ పవర్ ప్లాంట్ పనులు తుది దశలో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. పాఠశాలలకు అవసరమైన స్టిచ్చింగ్ పనులను మహిళా సంఘాల ద్వారా చేపట్టేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆదర్శ పాఠశాలలకు సంబంధించిన చెల్లింపులు దాదాపు 99 శాతం పూర్తయ్యాయని తెలిపారు.
ఐడీఓసీ క్యాంటీన్ తరహాలో ఇతర పట్టణ ప్రాంతాల్లో కూడా మెప్మా సహకారంతో మహిళా సంఘాలకు ఆదాయ అవకాశాలు కల్పించే కార్యక్రమాలను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు. మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడంతో పాటు స్థానిక వనరుల ఆధారంగా స్థిరమైన ఆదాయ మార్గాలను అభివృద్ధి చేసేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
చీపురుగూడెం గ్రామంలో జీవనజ్యోతి గ్రామ సమాఖ్యకు సంబంధించిన భవనంతో పాటు మరో భవనానికి కూడా మంజూరు లభించిందని, ఒక భవనం పూర్తయి ప్రారంభించామని, మిగిలిన భవనం పనులను కూడా త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.
ములకలపల్లి ప్రాంతంలో మహిళా సంఘాలు తమ వాటా నిధులను సమకూర్చుకుని అవసరమైన స్థలాన్ని కొనుగోలు చేసి భవనాలు నిర్మించేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. మహిళా సంఘాలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించే లక్ష్యంతో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
జిల్లాలో మహిళా సంఘాల భవనాలు, ఉపాధి కార్యక్రమాలు, సోలార్ పవర్ ప్లాంట్లు, మార్కెటింగ్ అవకాశాలు తదితర కార్యక్రమాలను శాఖల సమన్వయంతో వేగవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మహిళా సాధికారత, గిరిజన సంక్షేమం, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమాల్లో డిఆర్డిఓ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని స్వర్ణలత లేనినా,సంబంధిత శాఖల అధికారులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
