ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeభక్తి - ఆధ్యాత్మికత*ఆధ్యాత్మిక వైభవానికి నూతన అధ్యాయం... బలభద్రపురంలో కృష్ణ–సంతోషిమాత–అయ్యప్ప దేవస్థానం సిద్ధం*

*ఆధ్యాత్మిక వైభవానికి నూతన అధ్యాయం… బలభద్రపురంలో కృష్ణ–సంతోషిమాత–అయ్యప్ప దేవస్థానం సిద్ధం*

📰 Generate e-Paper Clip

 

 

– దివ్యశోభతో అలరారుతున్న ఆలయం… భక్తులకు మరో మహా పుణ్యక్షేత్రం

బిక్కవోలు, జులై 09 (పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక – అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి): తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామం నేడు ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా, భక్తి పరిమళాలు వెదజల్లే పవిత్ర పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. ఇప్పటికే ఆంధ్ర షిర్డీ సాయినాథుని ఆలయం, తూర్పు తిరుమలగా ప్రసిద్ధి చెందిన ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం, భూగర్భ వారాహి అమ్మవారి ఆలయం వంటి దివ్య దేవాలయాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ గ్రామంలో మరో మహోన్నత ఆధ్యాత్మిక కేంద్రం భక్తులకు అందుబాటులోకి రానుంది.

అత్యంత సుందర శిల్పకళా నైపుణ్యంతో, ఆగమ శాస్త్ర సంప్రదాయాలకు అనుగుణంగా నిర్మితమైన కృష్ణ–సంతోషిమాత–అయ్యప్ప దేవస్థానం మహా ప్రారంభోత్సవానికి సర్వాంగసుందరంగా సిద్ధమైంది. ఆలయ నిర్మాణం పూర్తికావడంతో పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది.

ఈ దేవస్థానంలో అయ్యప్పస్వామితో పాటు వినాయకస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, కృష్ణ భగవానుడు, సంతోషిమాత విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఆలయంలోని ప్రతి మండపం, ప్రతి విగ్రహం భక్తులకు దైవానుభూతిని కలిగించేలా రూపుదిద్దుకుంది.

శబరిమల క్షేత్రాన్ని తలపించేలా నిర్మించిన పవిత్రమైన పద్దెనిమిది మెట్లు ఈ దేవస్థానానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. “స్వామియే శరణం అయ్యప్ప” నామస్మరణతో భక్తులు ఈ మెట్లను అధిరోహించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శబరిమల దర్శన అనుభూతిని గుర్తు చేసే విధంగా ఆలయ నిర్మాణం ఉండడం విశేషం.

ఈ మహత్తర ఆలయ నిర్మాణం వెనుక ఆలయ చైర్మన్, గురుస్వామి సబ్బేళ్ళ రామరెడ్డి సంకల్పం, భక్తి, సేవాభావం నిలిచాయి. భక్తులను ఏకం చేస్తూ, సేవా కార్యక్రమాలను సమన్వయం చేస్తూ, ఆలయ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన కృషి ఫలితంగానే ఈ దివ్య దేవస్థానం భక్తులకు అందుబాటులోకి వస్తోంది.

దేవస్థానం ప్రారంభం అనంతరం బలభద్రపురం గ్రామం మరింత ఆధ్యాత్మిక ప్రాధాన్యం సంతరించుకుని, రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులను ఆకర్షించే పుణ్యక్షేత్రంగా అవతరించే అవకాశముందని గ్రామ పెద్దలు, భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భక్తి, ధర్మం, సేవా భావాలకు నిలయంగా ఈ దేవస్థానం చిరస్థాయిగా నిలిచి, సమస్త భక్తులకు శాంతి, సౌభాగ్యం, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రసాదించాలని గ్రామ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!