పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ క్రైమ్ బ్యూరో వనం శ్రీనివాస్ దేవరకొండ: ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు చేపడుతున్న ఉద్యమ కార్యాచరణలో భాగంగా, దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ ని ఈరోజు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ, అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లకు అందుతున్న తక్కువ వేతనాలతో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 339 మంది అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు తక్కువ వేతనాలతో సేవలందిస్తున్నారని, తమ వేతనాలను పెంచి గౌరవప్రదమైన జీవనం సాగించే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టబోయే ధర్నా కార్యక్రమం గురించి కూడా ఎమ్మెల్యే కి వివరించారు. ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, అసెంబ్లీలో ప్రస్తావించి సంబంధిత శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో చర్చించి న్యాయం జరిగేలా సహకరించాలని ఎమ్మెల్యే బాలు నాయక్ ని కోరారు. “విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయుల జీవితాల్లో కూడా భరోసా ఉండాలి. మా డిమాండ్లు న్యాయమైనవే. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించే వరకు మా పోరాటాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగిస్తాం” అని అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ నియోజకవర్గంలోని వివిధ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు పాల్గొన్నారు.
