ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిటెస్కో డైరెక్టర్ పదవీ రేసులో చింతల వెంకటేశ్వర్లు

టెస్కో డైరెక్టర్ పదవీ రేసులో చింతల వెంకటేశ్వర్లు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 25 2026: పెద్దమందడి మండలం వెల్టూరు ప్రాథమిక పారిశ్రామిక చేనేత సహకార సంఘం పాలకవర్గ సభ్యులు ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో చింతల వెంకటేశ్వర్లును ఏకగ్రీవంగా డైరెక్టర్‌గా ఎన్నుకున్నారు. సుదీర్ఘ రాజకీయ, సహకార రంగ అనుభవం కలిగిన ఆయన ప్రస్తుతం టెస్కో (తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ) డైరెక్టర్ పదవికి బలమైన పోటీదారుగా నిలుస్తున్నారు. సి. వెంకటేశ్వర్లు గతంలో WICS చైర్మన్, డీసీసీబీ (DCCB) డైరెక్టర్, అలాగే తన స్వగ్రామానికి మాజీ ఎంపీటీసీ గా సేవలందించారు. చేనేత రంగంలో ఆయనకు ఉన్న అనుభవం, సహకార సంఘాలతో ఉన్న అనుబంధం టెస్కో డైరెక్టర్ ఎన్నికల్లో ఆయనకు బలంగా మారనున్నాయని చేనేత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2013లో చేనేత సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత చాలా కాలం ఎన్నికలు జరగలేదు. ఎట్టకేలకు ఈ ఏడాది జూన్ 7న ఎన్నికలు నిర్వహించడంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్త పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. ఈ క్రమంలో వెలటూరు ప్రాథమిక పారిశ్రామిక చేనేత సహకార సంఘం సభ్యులు సి. వెంకటేశ్వర్లును ఏకగ్రీవంగా డైరెక్టర్‌గా ఎన్నుకోవడం విశేషంగా నిలిచింది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో టెస్కో పాలకవర్గ ఎన్నికలకు నోటిఫికేషన్ త్వరలో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో చేనేత సహకార సంఘాల్లో రాజకీయ చైతన్యం నెలకొంది. టెస్కోలో చైర్మన్‌తో పాటు డైరెక్టర్లను కూడా ఎన్నిక చేస్తారు. జిల్లాల వారీగా చేనేత సహకార సంఘాల అధ్యక్షులు (చైర్మన్లు) ముందుగా డైరెక్టర్లను ఎన్నుకుంటారు. అనంతరం ఎన్నికైన డైరెక్టర్లలో ఒకరిని రాష్ట్ర టెస్కో చైర్మన్‌గా ఎన్నుకోవడం ఆనవాయితీ. అయితే ప్రభుత్వ మద్దతు ఉన్న అభ్యర్థినే చైర్మన్‌గా ఎన్నుకునే సంప్రదాయం కొనసాగుతోంది. ఈ ఎన్నికలు కేవలం చేనేత పారిశ్రామిక సహకార సంఘాలకు మాత్రమే పరిమితం కాగా, పవర్‌లూమ్ (మరమగ్గాల) సంఘాల చైర్మన్లకు ఇందులో ఓటు హక్కు ఉండదు. గతంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన టెస్కోకు 10 మంది డైరెక్టర్లను ఎన్నుకునే విధానం ఉండేది. ఈసారి పాత జిల్లాల ప్రకారమా లేదా కొత్త జిల్లాల ప్రాతిపదికన స్థానాలను కేటాయిస్తారా అనే అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. నోటిఫికేషన్ వెలువడకముందే డైరెక్టర్ పదవుల కోసం పోటీ తీవ్రంగా మారింది. జిల్లాలోని చేనేత సహకార సంఘాల అధ్యక్షుల మద్దతు కూడగట్టేందుకు ఆశావహులు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఆర్థికంగా బలమైన సంఘాల చైర్మన్లు, చేనేత కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న సంఘాల ప్రతినిధులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సి. వెంకటేశ్వర్లు టెస్కో డైరెక్టర్ పదవికి బలమైన అభ్యర్థిగా చర్చనీయాంశమవుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!