మిల్లర్లతో కుమ్మక్కై ఏ గ్రేడ్ ధాన్యాన్ని బీ-గ్రేడ్‌గా మార్చి దోపిడి
మల్యాల తహసీల్దార్ కార్యాలయంలో బీజేపీ నేతల వినతి పత్రం
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక – పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర క్రైమ్ బ్యూరో: మే 20 2026 రావూరి నాగేశ్వరరావు: జగిత్యాల మల్యాల మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులు, మిల్లర్ల దోపిడి, కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాలపై భారతీయ జనతా పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల అధ్యక్షులు గాజుల మల్లేశం ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు మల్యాల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాణికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… ప్రస్తుతం మండలంలోని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు నెల రోజులుగా పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రణాళికా లోపాల కారణంగా కొనుగోళ్లు సకాలంలో పూర్తికాక రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యంగా నాణ్యమైన ఏ-గ్రేడ్ ధాన్యాన్ని కావాలనే “బి-కేటగిరి” కింద నమోదు చేసి క్వింటాల్‌కు రూ.20 వరకు తక్కువ ధర చెల్లిస్తూ మిల్లర్లు రైతుల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. అధికారులు ప్రేక్షక పాత్ర వహించకుండా రైతులకు పూర్తి మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో వేసిన కాటా చిట్టి ప్రకారమే రైతులకు పూర్తి చెల్లింపులు చేయాలని, “తాలు”, “తరుగు” పేరుతో అదనపు కోతలు విధిస్తూ జరుగుతున్న దోపిడీని అరికట్టాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించే మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు అందుబాటులో లేక రైతుల ధాన్యం తడిసిపోతుందనే ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే టార్పాలిన్లు సరఫరా చేసి ధాన్యం రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే అదనపు లారీలను ఏర్పాటు చేసి రాబోయే రెండు మూడు రోజుల్లో కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని పూర్తిగా మిల్లులకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, లేకపోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బింగి వేణి, మహిళా మోర్చా అధ్యక్షురాలు కటకం లత, బీజేవైఎం అధ్యక్షుడు పొన్నగంటి గౌతం, ఓబీసీ మోర్చా మండలాధ్యక్షుడు బొమ్మన పరమేష్, బోట్ల ప్రసాద్, బొబ్బిలి వెంకటస్వామి యాదవ్, మాజీ ఎంపీటీసీ రాచర్ల రమేష్, ప్రధాన కార్యదర్శి పిల్లి రాజశేఖర్, కొణిదల రాజన్న, ముదిగంటి రాజు, మైపాల్ రెడ్డి, చింతకుంట భరత్, గుండేటి గంగారం, దాసరి విజయకుమార్, రాజ్ కుమార్, తడగొండ రాజు, గడ్డం మల్లేశం, సంఘ శంకర్, షేర్ల పరశురాం తదితర బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
