ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeతెలంగాణఅశ్వారావుపేట15 ఏళ్ల నీటి గోసకు తెర గోపాలపురంలో పుష్కలంగా ఉబికిన జలాలు

15 ఏళ్ల నీటి గోసకు తెర గోపాలపురంలో పుష్కలంగా ఉబికిన జలాలు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్,దమ్మపేట,సెప్టెంబర్ 1: దమ్మపేట మండలం జమేదార్ బంజార్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోపాలపురం గ్రామ ప్రజలను సుమారు 15 ఏళ్లుగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రత్యేక చొరవతో చేపట్టిన నూతన బోరుబావి డ్రిల్లింగ్‌ విజయవంతం కావడంతో భూగర్భం నుంచి పుష్కలంగా నీరు లభ్యమైంది. దీంతో గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

గత పదిహేనేళ్లుగా గోపాలపురం గ్రామంలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో మూడు పర్యాయాలు బోర్లు వేసినా నీరు పడకపోవడంతో అవి విఫలమయ్యాయి. గ్రామంలో ఉన్న ఒకే ఒక్క వాటర్‌ ట్యాంక్‌పై ఆధారపడాల్సి రావడంతో వేసవి కాలంలో పరిస్థితి మరింత దయనీయంగా మారేది. మిషన్‌ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు సమీపంలోని పామాయిల్‌ తోటలకు వెళ్లి బిందెలతో నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కొన్ని సందర్భాల్లో వాటర్‌ ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వచ్చేది.

ఈ నేపథ్యంలో గ్రామ ప్రజల తాగునీటి కష్టాలను గుర్తించిన సర్పంచ్‌ ఈశ్వరప్రగడ నాగభూషణ్‌, పంచాయతీ కార్యదర్శి పాముల ముక్తేశ్వరరావు, పాలకవర్గ సభ్యులు ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామ పెద్దలు, పాలకవర్గ సభ్యులతో చర్చించి అనువైన ప్రాంతాన్ని గుర్తించి నూతన బోరుబావి తవ్వకానికి చర్యలు చేపట్టారు.

తాజాగా చేపట్టిన బోరు డ్రిల్లింగ్‌ పనుల్లో భూగర్భం నుంచి పుష్కలంగా నీరు ఉబికి రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. 15 ఏళ్లుగా తీరని తాగునీటి సమస్యకు పరిష్కారం లభించడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ఇన్నేళ్లుగా తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను గుర్తించి బోరుబావి ఏర్పాటుకు కృషి చేసిన సర్పంచ్‌, కార్యదర్శి, పాలకవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన బోరుతో తమ తాగునీటి కష్టాలు తీరనున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.

ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని సర్పంచ్‌ నాగభూషణ్‌, కార్యదర్శి ముక్తేశ్వరరావు, పాలకవర్గ సభ్యులు తెలిపారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని, ప్రజలు తమ సమస్యలను పాలకవర్గం దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!