ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంభవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దు: సీఐటీయూ

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దు: సీఐటీయూ

📰 Generate e-Paper Clip

వెల్ఫేర్ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ – తహసీల్దార్‌కు వినతిపత్రం

వెల్ఫేర్ బోర్డు ద్వారానే కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలు అందించాలని విజ్ఞప్తి.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి జూన్ 30 2026: ఖమ్మం జిల్లా సీఐటీయూ సత్తుపల్లి పట్టణ మండల కమిటీ ఆధ్వర్యంలో సత్తుపల్లి తహసీల్దార్ పి. సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొలికపోగు సర్వేశ్వరరావు మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు స్కీములను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దని, వెల్ఫేర్ బోర్డు నుంచే కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. సీఎస్‌సీ సంస్థ నిర్వహిస్తున్న హెల్త్ టెస్టులను వెంటనే రద్దు చేయాలని, సహజ మరణ పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచాలని, పెండింగ్ క్లెయిమ్‌ల నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న ప్రమాద మరణం, సహజ మరణం, శాశ్వత మరియు పాక్షిక అంగవైకల్యానికి సంబంధించిన మూడు స్కీములను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం.12ను 22-07-2025న విడుదల చేసిందన్నారు. అనంతరం ట్రెయిల్ బ్లేజర్ అనే బ్రోకర్ సంస్థ ద్వారా రూ.346 కోట్లను ప్రైవేట్ బీమా కంపెనీలకు బదిలీ చేశారని ఆరోపించారు. కార్మికులకు ఎటువంటి ఉపయోగం లేని సీఎస్‌సీ హెల్త్ టెస్టుల పేరుతో రూ.750 కోట్లకు పైగా ఆ సంస్థకు చెల్లించి వెల్ఫేర్ బోర్డు సెస్సు నిధులను దుబారా చేశారని విమర్శించారు. కేంద్ర చట్టం, రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమంగా ఇన్సూరెన్స్ కంపెనీలకు, సీఎస్‌సీ సంస్థకు వందల కోట్ల రూపాయలు కట్టబెట్టడం దుర్మార్గమని పేర్కొన్నారు. 1996 భవన నిర్మాణ కార్మికుల కేంద్ర చట్టం ప్రకారం వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని నియమించి, వారి నిర్ణయం మేరకే బోర్డు నిధులను ఖర్చు చేయాలని చట్టం పేర్కొంటుందని అన్నారు. అయితే అడ్వైజరీ కమిటీని నియమించకుండా ప్రభుత్వం, కార్మిక శాఖ అధికారులు కమిషన్ల కోసం గుర్తింపు లేని ఇన్సూరెన్స్ కంపెనీలకు స్కీములను అప్పగించి పేద నిర్మాణ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 2009 నుంచి 2025 వరకు వెల్ఫేర్ బోర్డులో 28 లక్షల 50 వేల మంది కార్మికులు నమోదు చేసుకోగా, కేవలం 15 లక్షల మంది కార్డులను మాత్రమే రెన్యువల్ చేసి, ఒక్కో కార్మికుడికి రూ.2,309 చొప్పున మొత్తం రూ.346.36 కోట్లను ప్రైవేట్ బీమా కంపెనీలకు చెల్లించారని తెలిపారు. 2025 జూలై 24 నుంచి ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ కంపెనీలు కార్మికులకు రూ.140 కోట్ల నష్టపరిహారం మాత్రమే చెల్లించగా, సుమారు రూ.200 కోట్లు తమ వద్దే మిగిల్చుకున్నాయని ఆరోపించారు. బోర్డు నుంచి డేటా అందలేదనే సాకుతో వేలాది మంది కార్మికులకు నష్టపరిహారం ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని, 13 లక్షల మంది కార్మికుల కార్డులను రెన్యువల్ చేయకుండా అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. వివాహ కానుక, ప్రసూతి కానుక, ఆస్పత్రి ఖర్చులు, దహన సంస్కారాల ఖర్చులు వంటి పథకాలను కూడా కార్మికులకు అందకుండా చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన అనుమతిని కొనసాగించకుండా జీఓ నెం.12ను రద్దు చేసి, ప్రభుత్వమే వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పెండింగ్ క్లెయిమ్‌లకు నిధులు విడుదల చేయాలని, రెన్యువల్ కాని 13 లక్షల మంది కార్మికుల లేబర్ కార్డులను యుద్ధప్రాతిపదికన రెన్యువల్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సత్తుపల్లి రూరల్ కార్యదర్శి కావూరు వెంకటేశ్వరరావు, రమేష్, లక్ష్మణ్, నరసింహారావు, మారేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!