ఉప్పల్ జోనల్ కమిషనర్ కి వినతి పత్రం 
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఉపేందర్ కూరెళ్ళ నవంబర్ 14 2026: మేడిపల్లి పరిధిలోని కమల నగర్ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డును ఆనుకొని వెలుస్తున్న అక్రమ షెడ్ నిర్మాణంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా, మున్సిపల్ నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి కొందరు వ్యక్తులు యథేచ్ఛగా అర్ధరాత్రి 11 గంటలకు ఈ నిర్మాణాలను చేపడుతున్నారు. ప్రధాన రహదారిని ఆనుకొని, కొన్ని చోట్ల ఏకంగా రోడ్డు స్థలాన్ని సైతం ఆక్రమించి ఈ షెడ్ ను ఏర్పాటు చేస్తుండటంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు.
ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ప్రమాదాల ముప్పు
కమల నగర్ కాలనీ ప్రధాన రహదారిపై నిత్యం 15 కాలనీల వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డు పక్కనే అక్రమంగా నిర్మిస్తున్న ఈ షెడ్ వల్ల రహదారి పూర్తిగా ఇరుకుగా మారుతోంది. ఈ షెడ్ వద్దకు వచ్చే వారు తమ వాహనాలను రోడ్డుపైనే నిలపడం వల్ల ఉదయం, సాయంత్రం వేళల్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ అక్రమ నిర్మాణాల కారణంగా వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒక అడుగు ముందుకేసి వరంగల్ నేషనల్ హైవే మీద పాన్ డబ్బా ఏర్పాటు చేశారు. ఈ పాన్ డబ్బా మరియు టీ పాయింట్ వలన ప్యాసింజర్ ఆటోలు, సెవెన్ సీటర్ ఆటోలు రోడ్డు ఆక్రమిస్తూ అక్కడ పార్కు చేయడం వలన పాదచారులు నడవడానికి కనీసం ఫుట్‌పాత్ స్థలం కూడా లేకపోవడంతో, ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని రోడ్డుపైనే నడవాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల ఉదాసీనతపై స్థానికుల మండిపాటు
నేషనల్ హైవే 163 రోడ్డు మీద ఇంత అక్రమంగా రోడ్డును ఆక్రమిస్తూ షెడ్ వేస్తున్నా సంబంధిత మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఆక్రమణల లీగాలిటీని తనిఖీ చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆక్రమణదారులు మరింత రెచ్చిపోయి రోడ్లను కబ్జా చేస్తున్నారని వాపోతున్నారు. ఇట్టి విషయంపై హైడ్రా అధికారులు, జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించాలి. ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తూ, కాలనీ అందాన్ని పాడుచేస్తూ రహదారులను ఆక్రమించి నిర్మిస్తున్న ఈ అక్రమ షెడ్ పై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని కమల నగర్ కాలనీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేసి, రోడ్డు మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేయాలని మరియు ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.


