ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeభక్తి - ఆధ్యాత్మికతశ్రీ భూగర్భ వారాహిమాత ఆలయంలో గుప్త నవరాత్రి మహోత్సవాలకు సర్వం సిద్ధం

శ్రీ భూగర్భ వారాహిమాత ఆలయంలో గుప్త నవరాత్రి మహోత్సవాలకు సర్వం సిద్ధం

📰 Generate e-Paper Clip

 

 

భక్తుల కోరికలు తీర్చే వారాహి అనుగ్రహానికి అరుదైన ఆధ్యాత్మిక వేళ

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి బిక్కవోలు, జూలై 10: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని శ్రీ భూగర్భ వారాహిమాత ఆలయంలో ఆషాఢమాస గుప్త నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే గుప్త నవరాత్రులు శాక్తేయ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన, మహిమాన్వితమైన పర్వదినాలుగా భావించబడతాయి. ఈ తొమ్మిది రోజుల పాటు జగజ్జనని శ్రీ వారాహిమాతకు మహాభిషేకాలు, సహస్రనామార్చనలు, విశేష కుంకుమార్చనలు, దీపారాధనలు, ప్రత్యేక పుష్పాలంకరణలు, నిత్య విశేష సేవలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో భూగర్భంలో కొలువై ఉన్న అరుదైన శ్రీ వారాహిమాత క్షేత్రంగా ఈ ఆలయం విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సంతరించుకుంది. భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో తల్లిని దర్శించి ఆరాధిస్తే శత్రుబాధలు, దుష్టశక్తుల ప్రభావం, గ్రహదోషాలు తొలగి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, ధైర్యం, విజయాలు, కుటుంబ సుఖశాంతులు ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసమని ఆలయ అర్చకులు పేర్కొన్నారు.

గుప్త నవరాత్రులు శ్రీ వారాహిమాత అనుగ్రహాన్ని పొందేందుకు అత్యంత శ్రేష్ఠమైన కాలమని ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయని అర్చకులు వివరించారు. ఈ పవిత్ర దినాల్లో అమ్మవారికి సమర్పించే ఒక్క కుంకుమార్చన, ఒక్క దీపారాధన, ఒక్క నమస్కారం, ఒక్క మంత్రజపం కూడా అనేక రెట్లు పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుందని తెలిపారు. నిష్కల్మషమైన భక్తితో అమ్మవారిని ప్రార్థించిన వారికి అసాధ్యాలు సుసాధ్యాలుగా మారి, అడ్డంకులు తొలగి, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల అనుభవాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయని చెప్పారు.

వారాహిమాతను ఆది పరాశక్తి స్వరూపిణిగా, దుష్ట సంహారిణిగా, భక్తాభీష్ట వరప్రదాయినిగా ఆరాధిస్తారు. ఆమె కృపాకటాక్షం లభించిన వారి జీవితాల్లో నూతన వెలుగులు నిండిపోతాయని, భయాలు, ఆందోళనలు తొలగి ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందుతుందని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వివాహం, ఆర్థికాభివృద్ధి వంటి అనేక రంగాల్లో అమ్మవారి అనుగ్రహం విశేష ఫలితాలను ప్రసాదిస్తుందనే విశ్వాసంతో ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు.

ఈ సందర్భంగా ఈ నెల 13వ తేదీ నుంచి శ్రీ వారాహిమాత మాలధారణ కార్యక్రమం ప్రారంభం కానుందని ఆలయ కమిటీ తెలిపింది. మాలధారణ చేపట్టే భక్తులు ముందుగానే ఆలయ కమిటీని సంప్రదించాలని సూచించారు. మాలధారణ భక్తుల కోసం నవరాత్రులంతా అన్నప్రసాదంతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలను ఆలయ కమిటీ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

గుప్త నవరాత్రి మహోత్సవాల్లో నిర్వహించే ప్రతి విశేష పూజా కార్యక్రమంలో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని జగజ్జనని శ్రీ భూగర్భ వారాహిమాత దివ్య కృపాకటాక్షాలను పొందాలని ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. అమ్మవారి అనుగ్రహంతో సకల విఘ్నాలు తొలగి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సంతానం, విద్య, ఉద్యోగ, వ్యాపారాభివృద్ధి, ఆధ్యాత్మిక శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు.

“వారాహి కటాక్షం ఉంటే అసాధ్యం సుసాధ్యం అవుతుంది… తల్లి అనుగ్రహం ఉంటే భక్తుని జీవితంలో చీకట్లు తొలగి విజయాల వెలుగులు ప్రసరిస్తాయి” అనే అచంచల విశ్వాసంతో వేలాది మంది భక్తులు ఈ గుప్త నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందేందుకు సిద్ధమవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!