మందమర్రిలో బైక్ దొంగ అరెస్ట్.. 4 మోటార్ సైకిళ్లు స్వాధీనం

మందమర్రి, మే 20:
పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
మందమర్రి పట్టణంలో వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్థుడిని మందమర్రి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. లక్షల విలువైన 4 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
మందమర్రి సిఐ రమేష్ గారి కథనం ప్రకారం… శాంతినగర్‌కు చెందిన గటాడి లక్ష్మీనారాయణ (48) ఒక పెట్రోల్ పంపులో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో దొంగతనాల బాట పట్టాడు. పెట్రోల్ బంకుకు వచ్చే వాహనాలను గమనిస్తూ, పట్టణంలో ఎక్కడైనా ఒంటరిగా, తాళం వేయకుండా లేదా నిర్లక్ష్యంగా పార్క్ చేసి ఉన్న బైక్‌లను లక్ష్యంగా చేసుకునేవాడు. ఎవరూ లేని సమయం చూసి మాస్టర్ కీ లేదా ఇతర పద్ధతుల్లో లాక్ తీసి బైకులను దొంగిలించి పరారయ్యేవాడు.
పోలీసుల నిఘా.. వాహన తనిఖీల్లో దొరికిన నిందితుడు
గత కొంతకాలంగా మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా బైకులు మాయమవుతుండటంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో స్థానిక పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. బుధవారం నమ్మదగిన సమాచారం రావడంతో పోలీసులు పట్టణంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు దొంగతనాలు వెలుగులోకి వచ్చాయి.
మందమర్రి పరిధిలో తానే ఈ దొంగతనాలకు పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అతనిచ్చిన సమాచారం మేరకు పోలీసులు నాలుగు వేర్వేరు కేసులకు (Cr.No: 99, 100, 110, 112 / 2026) సంబంధించిన 4 బైకులను రికవరీ చేశారు.
స్వాధీనం చేసుకున్న బైకుల వివరాలు:
స్ప్లెండర్ ప్రో (AP 01 ED 6088)
స్ప్లెండర్ ప్లస్ (AP 01 S 8969)
హెచ్.ఎఫ్ డీలక్స్ (TS 01 EB 1329)
హెచ్.ఎఫ్ డీలక్స్ (TS 19 B 4031)
మందమర్రి సిఐ రమేష్ గారు
వరుస దొంగతనాల కేసులను సకాలంలో ఛేదించి, నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న మందమర్రి ఎస్ఐ నరేష్ ను, సిబ్బంది రాకేష్, మహేష్, చైతన్య లను ప్రత్యేకంగా అభినందించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి: మందమర్రి సిఐ రమేష్
“వాహనదారులు తమ ద్విచక్ర వాహనాలను ఎక్కడపడితే అక్కడ కాకుండా సురక్షితమైన ప్రదేశాలలో లేదా సీసీ కెమెరాల నిఘా ఉన్న చోట పార్క్ చేయాలి. కేవలం హ్యాండిల్ లాక్ మాత్రమే కాకుండా, విధిగా అదనపు లాకులు (డబుల్ లాక్) వేసుకోవడం ద్వారా ఇలాంటి దొంగతనాలను అరికట్టవచ్చు” అని ఈ సందర్భంగా మందమర్రి సిఐ రమేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
